జనగామ, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘దేవునూర్‌లో నీ బినామీల పేర్లతో భూములు ఉన్నాయ్.. అందులో నువ్వే వ్యవసాయం చేయించిన ఫొటోలను త్వరలో బయటపెడుతా.. నీ భూబాగోతాన్ని ప్రజల్లో బట్టబయలు చేస్తా.. జాగ్రత్త బిడ్డా! ఇక నువ్వు ఏది మాట్లాడిన చెల్లదు.. నీకు చీము, నెత్తురు, సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి ఉపఎన్నికకు రా.. పిచ్చిగా మాట్లాడితే స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిన్ను రాజకీయంగా బొందపెట్టడం గ్యారెంటీ’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన లింగాలఘనపురం మండల సన్నాహక సమావేశంలో పల్లా మాట్లాడారు.
‘హనుమకొండలో అత్యంత పెద్ద ఇల్లు కట్టుకున్నవ్.. దానికి డబ్బులు ఎకడి నుంచి వచ్చాయ్? ఎవరు కట్టించారో నీకు తెలియదా? నీకు వచ్చిన పనులన్నీ నీ అల్లుడితో చేయిస్త్తలేవా? హైదరాబాద్‌లో మూడు ఇండ్లు కట్టినవ్.. అమెరికాలో మూడిండ్లు ఉన్నయ్.. వాటికి డబ్బులు ఎకడ నుంచి వచ్చాయ్’ అంటూ కడియాన్ని ప్రశ్నించారు. ‘నీకు బరాబర్‌గా దేవునూర్‌లో భూమి ఉన్నది.. నీ బినామీ పేర్ల మీద ఉన్నది. నువ్వు వ్యవసాయం చేయించినవ్. నీకు కావాల్సిన ఫొటోస్ బయట పెడుతా. ఇవన్నీ వాస్తవాలని దేవునూర్ ప్రజలే చెప్తరు’ అని ఆయన స్పష్టంచేశారు.
‘అశ్వరావుపల్లి నుంచి ఆర్ఎస్ ఘన్పూర్ మీదుగా నవాబ్‌పేటకు కావాల్సిన కాల్వల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరగలేదా? దేవాదుల గురించి నేను చేశానని ఎట్లా మాట్లాడుతవ్’ అని ఎమ్మెల్యే కడియంపై పల్లా ధ్వజమెత్తారు. రూ.104 కోట్లతో ఎత్తయిన ప్రాంతాలకు నషల్ దగ్గర ఒక లిఫ్ట్, గండిరామారం దగ్గర రెండో లిఫ్ట్, పీసర దగ్గర మూడో లిఫ్ట్‌లను తెచ్చింది తానేనని ఆయన స్పష్టం చేశారు. రూ.800 కోట్లలో రూ.వంద కోట్లు తెచ్చానని చెప్పడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. దేవాదుల పూర్తి చేసింది, ఏడు రిజర్వాయర్లు కట్టించింది కేసీఆర్ నాయకత్వంలో ఉన్న రెండు ప్రభుత్వాలు తప్పా మరొకటి కాదని అన్నారు.
‘ నీకు సభ్యత, సంసారం, సహనం లేదు. నేను స్టేషన్‌ఘన్‌పూర్‌కు గెస్ట్‌ను, నువ్వు ఘోస్ట్వి మాత్రమే’ అని పల్లా మండిపడ్డారు. ‘నీకు దమ్మూ ధైర్యం ఉంటే నియోజకవర్గంలో నువ్వు నా కన్నా ఒక రోజు ఎకువ తిరిగినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా’నని పల్లా సవాల్ చేశారు. నియోజకవర్గంలో నా కంటే ఎన్నిరోజులు ఎక్కువ తిరిగావ్? అసెంబ్లీకి నువ్వు ఎన్ని రోజులు వచ్చావ్? నేను ఎన్ని రోజులు వచ్చానో లెక బెడుదాం. నాకన్నా ఒక రోజు ఎకువ వచ్చినట్టు తేలినా, అసెంబ్లీలో నువ్వు నా కన్నా ఒక నిమిషం ఎకువ మాట్లాడినట్టు తేల్చినా నేను రాజీనామా చేస్తా’నని పల్లా స్పష్టంచేశారు.