హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా జాతీయ హోదా ఇవ్వలేమని వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా కల్పించడంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీముకు జాతీయ హోదా కోరింది. ఈ ప్రాజెక్టు సాంకేతిక-ఆర్థిక మదింపును కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) నిర్వహించాలి. తరువాత ఈ ప్రాజెక్టు నీటి పునరుద్ధరణ, వరద నియంత్రణ, బహుళ ప్రయోజన ప్రాజెక్టులపై సలహా కమిటీ నుంచి ఆమోదం పొందాలి. ఈ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లోనే సీడబ్ల్యూసీకి సాంకేతిక-ఆర్థిక మదింపు కోసం సమర్పించింది. అయితే, ఈ ప్రాజెక్టు కృష్ణానది జలాలను ఉపయోగించడం, అంతర్రాష్ట్ర అంశాలను కలిగి ఉండటం వల్ల కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 దర్యాప్తు పరిధిలో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక-ఆర్థిక మదింపు నిర్వహించలేం. కాబట్టి జాతీయ హోదా కూడా ఇవ్వలేం’ అని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.