హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు కరువుతో వలసలు పోయిన పాలమూరు జిల్లా ఇప్పుడు పచ్చటి పంటలతో పాలుగారుతున్నదని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసుకొంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వజ్రపు తునక అవుతుందన్నారు. వనపర్తిలో మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగసభలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే…
వనపర్తి జిల్లా అయితదని కలగనలేదు. అద్భుతమైన కలెక్టరేట్, పోలీస్ కార్యాలయం నిర్మించుకొన్నాం. ఈరోజే మెడికల్ కాలేజీ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశాను. 2001లో పిడికెడు మందితో నేను ఉద్యమానికి బయలుదేరిన్నాడు ఎన్నో బెదిరింపులు.. అవహేళనలు. రకరకాలుగా వేధించారు. బెదిరించారు. చాలాసార్లు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చి నేను కండ్లల్లో నీళ్లు పెట్టుకొని వెళ్లాను. ఆనాడు ఉన్న కరువు, వలసలు పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మా గోరటి వెంకన్న చెప్పినట్టు పల్లెల్లో మొలిసిన పల్లేరు చెట్లు.. ఎండిపోయే బోరు బావులు.. ఏడ్చిఏడ్చి ప్రజల కండ్లల్లో ఇంకిపోయిన నీళ్లు.. ఇవీ ఆనాటి బాధలు.. ఇప్పుడు మీ అందరి దీవెన, సహకారం, పోరాటంతో ముందుకు వెళ్లాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కచ్చితంగా ఉద్యమజెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతదని మాకు ఒకసారి కాదు.. రెండుసార్లు అధికారమిచ్చారు. దాని ప్రతిఫలం ఎక్కడనో చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాకముందు ఆనాటి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. ఇవాళ ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ వస్తే ఇదీ మార్పు.
ఈ మధ్య గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నాయనగారు చనిపోతే పలుకరించడానికి వెళ్లాను. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినా, ఆనాడున్న మన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు దద్దమ్మల్లా నోరు తెరవకుండా పడిఉంటే, నేను ఎన్నోసార్లు మాట్లాడాను. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా.. వంటివి కంప్లీట్ చేసుకున్నాం. తద్వారా వనపర్తి, దాని పరిసరాలు సస్యశ్యామలమయ్యాయి. హైదరాబాద్ నుంచి గద్వాల్ దాకా ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు, హార్వెస్టర్లు, డీసీఎంలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన పంటలతో పాలమూరు పాలుకారుతున్నది. ఇంకా కావాలి. పాలమూరు ఎత్తిపోతల పూర్తికావాలి. చట్టపరమైన చర్యలు తీసుకొని పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేస్తే 15, 16 లక్షల ఎకరాలకు నీరుపారి అద్భుతమైన పంటలు పండే బ్రహ్మాండమైన వజ్రపు తునకగా నా మహబూబ్‌నగర్ జిల్లా అవుతుంది. త్వరలోనే అది సాకారం చేస్తాం.
ఇవాళ మన వనపర్తి పట్టణంలో బస్సులో నేను తిరుగుతూ ఉంటే అడిగినా.. ఈ రోడ్డు ఏమైంది.. ఆ రోడ్డు ఏమైంది.. ఈ రోడ్డు పక్కన జాగా ఎంత ఉన్నదంటే రూ.5 కోట్లు, రూ.3 కోట్లు ధర ఉన్నదన్నరు. ఒకప్పుడు రూ.30 వేలు, రూ.3 లక్షలకు అమ్ముకొన్న వనపర్తిలో ఇవాళ రూ.3 కోట్లకు ఒక ఎకరమా! ఒక్క మెడికల్ కాలేజీ లేని పాలమూరులో ఐదు మెడికల్ కాలేజీలా! ఇదంతా ఎక్కడి నుంచి సాధ్యమైంది? మన భూముల ధరలు, మన 24 గంటల కరెంట్, మన సాగునీళ్లు, తాగునీళ్లు, ఎంత అద్భుతంగా అయ్యాయి! నిరంజన్‌రెడ్డి నాకు ఇప్పుడే చూపించారు. నేను ఇక్కడికి వచ్చిన బైపాస్ రోడ్డుకు రూ.100 కోట్లు, రూ.200 కోట్లు అయినా మంచిదే. రేపే మంజూరు చేస్తాం. ఈ రోడ్డు కూడా వెంటనే ఈ ఎండాకాలంలోనే పూర్తిచేయాలని కోరుతున్నా.
సొంత రాష్ట్రం వస్తే గిదీ.. ఇట్ల బతుకుతమని మనం అడిగినం. తీసుకొన్నం. అభివృద్ధి చేసుకొంటం. ఇక్కడ మంజూరు చేసిన పనులు చెప్తే, ఇప్పుడు నన్ను ఇక్కడే మర్రిజనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు కొడుతరు. వనపర్తికి చేసినవ్, మరి మా సంగతేంది సార్ అంటరు. కొడుతవా జనార్దన్‌రెడ్డి (నవ్వుతూ).. నాగర్ కర్నూల్ పోయేది ఉన్నది. అక్కడ కూడా చేసుకుందాం. అద్భుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నరు. ఎక్కడోళ్లు అక్కడ కొట్లాడుతున్నరు. మాట్లాడితే.. పాలమూరు జల్ది అయిపోవాలె సార్ అని మా శ్రీనివాస్‌గౌడ్ అంటడు. వెనుకబడ్డ జిల్లా కాబట్టి.. ఇవాళ పాలుకారుతున్నది కాబట్టి.. ఈ పాల పొంగు.. పాల పొంగులా కాదు. పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు ముందుకు పోవాలె. ఇంకా పురోగమించాలని మీ అందరినీ కోరుతున్నా. దళిత బిడ్డల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రూ.10 లక్షలు దళిత కుటుంబానికి ఇస్తా ఉన్నాం. తిరిగి ఇచ్చే అవసరం లేదు. ఇతర అన్ని వర్గాలు కూడా మన దళిత బిడ్డలకు అండగా ఉండి, అద్భుతంగా విజయవంతం చేయాలి. దేశమే మన దగ్గరి నుంచి నేర్చుకోవాలె.
ఈ రోజు అంతర్జాతీయ మహిళాదినోత్సవం.. ఈ సందర్భంలో మన రాష్ట్ర, దేశ, ప్రపంచంలోని మహిళలందరికీ నా తరఫున, మన రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటే.. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో.. గౌరవించబడతారో.. అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెప్తారు. తెలంగాణలో మన పేదింటి బిడ్డలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు మనం తీసుకొంటున్నాం.. అన్నీ మీ కండ్లముందే ఉన్నాయి.
నేను ఎనకట పాటలు పాడేవాడిని. కానీ ఇప్పుడు పాటలు పాడటం రాదు. నేనే రాసిన పాట ఇది..‘వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులనే వడివడిగా పూర్తిజేసి.. చెరువులన్నీ నింపి.. పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చపైట గప్పుకున్నది..’ అని రాశాను. ఏ నడిగడ్డలో నేను కన్నీళ్లు పెట్టుకున్ననో.. ఏ పాలమూరులో ప్రొఫెసర్ జయశంకర్‌గారు, నేను కలిసి అనేక సందర్భాల్లో కండ్లనీళ్లు పెట్టుకున్నమో.. జడ్చర్ల ఎమ్మెల్యే మా లక్ష్మారెడ్డిగారి నియోజకవర్గంలో వాలియానాయక్తండాలో ఏ గిరిజనులను చూసి మా హృదయాలు ఆనాడు ఏడ్చినవో.. ఇవ్వాళ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నం.
తెలంగాణలో అద్భుతమైన పంటలు పండుతున్నాయి. గ్రామాల్లో కొత్త ఇండ్లు కడుతున్నరు. తెలంగాణ వచ్చిన్నాడు కరెంటు లేదు.. మంచినీళ్లు లేవు.. సాగునీళ్లు లేవు. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 15 లక్షల మంది వరకు వలసలు వెళ్లేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. 11 రాష్ర్టాల నుంచి రాయచూర్, కర్నూలు జిల్లా నుంచి కూడా కూలీలుగా వస్తున్నరు. జీవితాన్ని గడుపుకొంటున్నరు. ఈ రోజు నేను పేపర్లలో చూసి గర్వపడుతున్నా.. ఏడేండ్లుగా అవినీతిరహితంగా అందరం పనిచేశాం కాబట్టే ఈ ఫలితాలు వచ్చాయి. ఈనాడు మనం సాధించిన మార్పు. ఇంక నాలుగు రోజులైతే అద్భుతమైన స్వర్గసీమల్లాంటి పల్లెలు తయారవుతయి.