నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు?
కృష్ణానదిలో నీళ్లున్నా ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు చేస్తున్నది. రైతులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఒత్తిడి తేవడంతో పాలమూరు ఎత్తిపోతల పథకం మోటర్లను ఆన్ చేసేందుకు ముందుకొచ్చినట్టే వచ్చి.. కేవలం 3గంటల మాత్రమే నడిపి ఆర్భాటం ప్రదర్శిస్తున్నది.
- పాలమూరు మోటర్లను మూడు గంటలు నడిపి సర్కార్ ఆర్భాటం
- బంద్ కావడంతో విమర్శలు
- విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా
- అన్నదాతల్లో అనుమానాలు
కొల్లాపూర్/ మహబూబ్‌నగర్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణానదిలో నీళ్లున్నా ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు చేస్తున్నది. రైతులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఒత్తిడి తేవడంతో పాలమూరు ఎత్తిపోతల పథకం మోటర్లను ఆన్ చేసేందుకు ముందుకొచ్చినట్టే వచ్చి.. కేవలం 3గంటల మాత్రమే నడిపి ఆర్భాటం ప్రదర్శిస్తున్నది. అంతేగాక విడుదల చేసిన ఆ నీటిని కూడా పంటలకు ఇస్తారా? లేదా బీర్ల కోసం వినియోగిస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ సాగునీళ్లు అడిగితే పట్టించుకోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా నీటిని బీర్ల కంపెనీలకు ఇస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
వర్షాభావ పరిస్థితులతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే పట్టించుకోని మంత్రి బీర్ల కంపెనీలకు నీళ్లు ఇస్తామని, రైతులకు ఇచ్చేది లేదని చెప్పడంపై విమర్శలు వచ్చాయి. ఈ ప్రకటన వెలువడిన వారంరోజుల్లోనే పాలమూరు పంపులు ఆన్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీటిని నల్లగొండకు మళ్లించేందుకు అక్కడి మంత్రులు చేస్తున్న ఒత్తిడి కూడా పంపులు ప్రారంభించడానికి కారణమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పాలమూరు ఎత్తిపోతలు ప్రారంభంకావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.
24గంటలు.. రెండు పంపులు… పావు టీఎంసీ నీళ్లు..
పాలమూరు పంపులను బుధవారం ఉదయం ప్రారంభించి, చివరి ఆయకట్టుకు నీళ్లు అందించే బాధ్యత తమదేనని మంత్రి జూపల్లి ప్రకటించారు. మంత్రి ఇలా వెళ్లిపోయారో లేదో సాయంత్రం పవర్ట్రిప్తో మోటర్లు ఆగిపోయాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాత్రి 10గంటలకు మోటర్లను ఆన్ చేశారు. 0.4 టీఎంసీలను ఎత్తిపోసినట్టు అధికారులు వెల్లడించారు. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం 6.4 టీఎంసీలు కాగా పంపులు ఆన్ చేయకముందు నీటి నిల్వ 2.8 టీఎంసీలు ఉన్నది. రిజర్వాయర్ సామర్థ్యం 6 టీఎంసీలకు చేరుకునేంతవరకు మోటర్లను రన్ చేస్తామని అధికారులు వెల్లడించారు.
ఇదంతా కేసీఆర్ పుణ్యమే..
కృష్ణానది పొడవునా అత్యధిక పరీవాహక ప్రాంతం ఉన్నా కరువు, వలసలకు నిలయంగా.. ప్రాజెక్టులు లేక తల్లడిల్లిన పాలమూరు నేల ఇప్పుడు పులకిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ, తుంగభద్ర, భీమా నదులు ప్రవహిస్తున్నా తాగు, సాగునీటికి గోసపడ్డ పాలమూరు జిల్లాలో తెలంగాణ ఆవిర్భవించాక ఒక్కసారిగా సాగు విస్తీర్ణం ఊహించని రీతిలో పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి రిజర్వాయర్లు, కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువులకు నీళ్లు పారించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కుట్రపూరితంగా చిన్నచిన్న రిజర్వాయర్లను నిర్మించి పొడవైన కాలువ ద్వారా సాగునీళ్లకు డిజైన్ చేసిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ఇంజినీర్ల ఫలితoగా పూర్తిస్థాయి నికరజలాలను వాడుకోలేని పరిస్థితిలోకి నెట్టేశారు.
ఏ ప్రభుత్వం వచ్చినా 285 టీఎంసీలు నిల్వ ఉండే శ్రీశైలం నీటి నుంచి వాడుకునే హక్కును కాలరాసి 4 టీఎంసీలు కూడా నిలువ చేసే పరిస్థితి లేని జూరాల ప్రాజెక్టు బూచి చూపించి రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారనేది నగ్నసత్యం. ఈ నేపథ్యంలో 2016లో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నికర జలాలను వాడుకునే విధంగా బృహత్తర ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 80% పూర్తయిన ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేవలం కేసీఆర్ ఆనవాళ్లు తుడిచి పెట్టాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు పొంగుతున్న శ్రీశైలం జలాల్లో కాంగ్రెస్ కన్నీళ్లు తోడై రైతుల పొలాలకు పారే పరిస్థితిని తీసుకువచ్చారు.
నార్లాపూర్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణా జలాలను చూసి రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇదంతా కేసీఆర్ పనితనమేనని చర్చించుకుంటున్నారు. 2023లో కేసీఆర్ ఇదే పంపులను ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి లిఫ్ట్ ఇరిగేషన్ సత్తా ఏందో రాష్ర్టానికి చూపించారు. ఎత్తిపోతల పథకంపై ఎన్నో విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు పాలమూరులో ఉప్పొంగుతున్న కృష్ణమ్మని చూసి జడిసిపోతున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి పిలుపుతో బీఆర్ఎస్ నేతలు కృష్ణమ్మకు జలాభిషేకం చేశారు. పాలమూరు పంపుల నుంచి వస్తున్న నీటిని చూసేందుకు రైతులు తరలివచ్చి సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ప్రారంభమై నార్లాపూర్లోకి కృష్ణా జలాలు ఉబికి వస్తున్న వేళ.. ఎప్పుడు కరెంటు పోతుందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నార్లాపూర్‌లో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
పాలమూరు ప్రాజెక్టు లిఫ్ట్-1 మోటర్లను ఆన్ చేయకుంటే నార్లాపూర్‌ను ముట్టడిస్తామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన హెచ్చరికతో ప్రభుత్వం దిగొచ్చిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు నీటిని అందించే డెలివరీ సిస్టర్న్ వద్ద తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రపటాలకు పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. రైతుల సంక్షేమం కోసం పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్ చేయకుంటే ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్టు ప్రకటించిన నేపథ్యంలో సర్కార్‌లో కదలిక వచ్చి మోటర్లను ఆన్ చేసిందని రైతులు పేర్కొన్నారు. అనంతరం పంపుల నుంచి వస్తున్న కృష్ణాజలాలకు పూలాభిషేకం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

