MLC Election | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ కుట్రకత్తులను పాలమూరు ఛేదించింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో బీఆర్ఎస్కే పట్టంగట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంతగడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేదికపై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే పాలమూరు ఫలితం పరేడ్ చేసింది. ఈ ఎన్నికను రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కాంగ్రెస్‌కు ఊహించని షాక్తగిలింది. సీఎంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు సహా కాంగ్రెస్ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డినా విజయం మాత్రం బీఆర్ఎస్నే వరించింది. సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు ప్రతి ఒక్కరితో మాట్లాడి మద్దతివ్వాలని కోరడమే కాకుండా ఒక దశలో ‘మీరు వేసే ఓటు జీవన్‌రెడ్డికి కాదు.. రేవంత్‌రెడ్డికి. నేనే నిలబడిన అనుకోండి. ఈ గెలుపు పాలమూరు భవితకు మలుపు’ అని అభ్యర్థించినా స్థానిక ఓటర్లు మాత్రం గులాబీ వెంటే నిలిచారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు గురించి రాజకీయ పార్టీలు చర్చోపచర్చలు జరుపుతున్న సందర్భంలో బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని కాంగ్రెస్ ఆహ్వానించింది. కల్వకుర్తి నుంచి కసిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాము లు తన కొడుకును పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపేందుకు బీజేపీలో చేరి, ఎంపీగా పోటీచేయటం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి బీఆర్ఎస్ రెండు సీట్లు గెలవటం, అనంతర పరిణామాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక బీఆర్ఎస్కు కత్తిమీద సాములా మారింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు కొత్తప్రభుత్వానికి ఆకర్షితులుగా ఉన్నా, ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా బీఆర్ఎస్ దీటుగా ఎదుర్కొన్నది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సహా మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేశాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సమన్వయం చేయటం వంటి పరిణామాలతో బీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ తన ‘స్థానిక’బలాన్ని నిలబెట్టుకున్నది. ‘ఎవరి సీటు వారు సాధించుకోవటం గొప్పేం కాదు’ అని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఈ ఫలితాన్ని తక్కువ చేసి చూస్తున్నా.. ఇక్కడి ప్రతికూల పరిస్థితిలో అభ్యర్థికి బలాన్నిచ్చి గెలిపు వ్యూహాన్ని రచించటమన్నది అసాధారణమైన అంశమని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా గులాబీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు పత్రం అందుకున్న ఆయన నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి చేరుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. నవీన్‌రెడ్డిని కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య , మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, శాక్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం కాంగ్రెస్‌దేనని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి సాంకేతికంగా గెలిచారంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన సచివాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి 111 ఓట్ల మెజార్టీతో గెలిచారని చెప్పారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 300 పైచిలుకు ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ, 652 ఓట్లు వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని చెప్పారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది నైతికంగా కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు.