Palamuru | గతంలో పాలమూరు పాటలు.. గుండెను పిండేసేవి. కథలు.. మనసును ద్రవింపజేసేవి. ఎండిన పొలాలు, వలస బతుకులు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఇప్పుడు అదే కరువు సీమలో.. సిరుల దరువు మొదలైంది. తెలంగాణ రాకతో నాటి వెనుకబడిన జిల్లా ముందడుగు వేసింది.
నేడు పాలమూరు పచ్చందనాల ఖిల్లా. హరిత వర్ణపు సొబగులు, గలగలపారే నీళ్లు, రైతన్నల ముచ్చట్లు.
మహబూబ్నగర్ జిల్లా గురించి ఆనాడు కవులు చెప్పిన కఠోర వాస్తవాలకు, ఈనాటి దశ తిరిగిన పాలమూరులో క్షేత్రస్థాయి నిజాలకు ఈ చిత్రాలే దర్పణాలు.
అలంపూర్ నుంచి అడ్డాకల్ వరకు గుక్కెడు నీళ్లకు అలమటించిన దుస్థితిని ఓ చిత్రం కండ్లకు కడితే… అదేచోట ఉప్పొంగిన భగీరథ నీళ్లను ఆప్యాయంగా ఆస్వాదిస్తున్న ఆడబిడ్డల సంతోషానికి మరో ఫొటో సాక్షిగా నిలుస్తుంది.
నాడు నీరు లేక కొడిగట్టిన వరిపొలాలు ఓ చిత్రంలో కలవరపెడితే.. మరో చిత్రం ‘కలయో వైష్ణవ మాయో!’ అన్నట్టుగా కనుచూపుమేరలో పచ్చదనాన్ని చూపుతుంది.
యాభై ఏండ్లు పీడించిన కష్టాలను పదేండ్లలో తీర్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఆనాటి పాలకుల మోసానికీ, ఈనాటి మన ముఖ్యమంత్రి పనితనానికీ పోలిక ఇది. కేసీఆర్ పాలనలో పాలమూరు తలరాత మారిన తీరు తెలంగాణ పురోగతికి కొలమానం. పదేండ్ల కిందటి వరకు పట్టిపీడించిన దరిద్రానికి, ఈ రోజు రెట్టించిన విజయానికి మేలి పోలిక ఈ చిత్ర మాలిక..
నీళ్లంటే గండమే
ఉమ్మడి రాష్ట్రంలో కరువు ప్రాంతం పాలమూరు తాగునీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కనిమెట్ట గ్రామంలో నీళ్ల కోసం బిందెలతో జనం బారులు తీరిన నాటి దుస్థితికి అద్దం ఈ చిత్రం.
తాగునీటి పండుగే
నాడు భుజాన బిందెలు మోసిన కనిమెట్ట గ్రామ మహిళలు మిషన్ భగీరథ పథకంతో ఇప్పుడు ఇంటిముందే నల్లానీళ్లు సంతోషంగా పట్టుకుంటున్నారు.
ఎండిన కష్టం
కరువు ఎంత కర్కశమో ఈ ఫొటోను చూస్తే తెలుస్తుంది. తన ఆకలి తీర్చాల్సిన వరి పంట సాగునీరు లేక ఎండిపోతే, గొర్రెలను మేతకు వదిలేశాడు ఆ రైతు. అతని పుట్టెడు కష్టానికి కన్నీటి సాక్ష్యంగా నిలిచే ఈ చిత్రం… వనపర్తి జిల్లా అల్వాల లోనిది.
పండిన స్వేదం
తెలంగాణ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవడంతో నీళ్ల గోస తీరింది.నాడు ఎండిన పొలాలే నేడు పచ్చగా కళకళలాడుతున్నాయి. నేలకు హరిత వర్ణాన్ని అద్దినట్టు ఇక్కడ కనిపిస్తున్నదీ అల్వాల రైతుల పొలాలే.
గేటు నిలబెట్టింది
మహబూబ్నగర్ సమీపంలో అప్పన్నపల్లి దగ్గర రైల్వేగేటు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ ప్రధాన రహదారిలో గేటు పడిందా.. భారీగా వాహనాలు నిలిచిపోయేవి. అత్యవసర వైద్య సేవలు అందక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
దారి పరిగెత్తింది
తెలంగాణ ఏర్పడ్డాక అప్పన్నపల్లి, మహబూబ్నగర్ మున్సిపాలిటీలో విలీనమైంది. ఆ వెంటనే రైల్వేగేట్ దగ్గర నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం మొదలైంది. ఆరు నెలల్లో పూర్తయ్యింది.
ఇరుకు తోవలో…
ఒకప్పుడు పాలమూరుకు నీళ్లే కాదు రోడ్లు కూడా అంతంత మాత్రమే. మహబూబ్నగర్-జడ్చర్ల దారి మయూరి పారు సమీపంలో మలుపులతో ఇరుకుగా ఉండేది.
హరిత దారిలో..
ఇప్పుడు మహబూబ్నగర్-జడ్చర్ల ప్రధాన రోడ్డు హైవేగా మారింది. రోడ్డు సమీపంలోని మయూరి పారు దేశంలోనే పెద్దదైన కేసీఆర్ ఎకో అర్బన్ పారుగా అవతరించింది. సందర్శకుల సందడి మొదలైంది.