KGBV | పేద పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి, నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గురుకులాల విద్యార్థులు ఆర్ధాకలితో అలమటిస్తున్నారు. పురుగులతో కూడిన భోజనం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తే, చివరకు కులం పేరుతో దూషిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పాలమకుల కేజీబీవీ విద్యాలయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అన్నంలో పురుగులు వస్తున్నాయి.. కూరలు నీళ్ల మాదిరి ఉన్నాయి. అన్నంలో, పప్పులో పురుగులు వస్తున్నాయి అని చెప్తే తీసి తినమని చెప్తున్నారు. తాగడానికి కూడా నీళ్లు సరిగ్గా లేవు. ప్రశ్నిస్తే.. వీపులు వాచేలా కర్రలతో కొడుతూ.. కులం పేరుతో దూషిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఐదు లీటర్ల పాలు పక్కన పెట్టుకుని రోజంతా ఉపాధ్యాయులు చాయ్ తాగుతున్నారు. టీచర్లు సమయానికి రావడం లేదు. మ. 12 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటలకే వెళ్లిపోతున్నారు. పాఠాలు సరిగా బోధించడం లేదు. పరీక్షలు నిర్వహించడం లేదని వాపోయారు.
ఒక ఉపాధ్యాయురాలు మీ దగ్గర దుర్వాసన వస్తుంది.. లంబాడీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మీరు స్నానం చెయ్యరా అని మాట్లాడుతుంది అని తమ బాధలను విద్యార్థినులు చెప్పుకున్నారు. వారంలో ఐదు రోజులు ఎగ్స్ ఇవ్వాలి, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారు, మటన్ రెండు సార్లు పెట్టాలి, అసలు ఒకసారి కూడా పెట్టట్లేదు, చికెన్ ఒకసారి పెడుతున్నారు. టీచర్స్ సెపరేట్‌గా సన్న బియ్యం వండుకొని తింటున్నారు, మాకేమో దొడ్డు బియ్యం పురుగులు అన్నం పెడుతున్నారని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు చెప్పాలని గురుకుల విద్యార్థినులకు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి ఫోన్ నంబర్ రాసిచ్చారు. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా తనకు ఫోన్ చేయమని అమ్మాయిలకు హరీశ్‌రావు సూచించారు. ఇక చివరకు తరగతి గది నుంచి బయటకు వస్తున్న సబితా ఇంద్రారెడ్డి కాళ్ల మీద పడి విద్యార్థినులు బోరున విలపించారు. తమకు స్టాఫ్‌ను మొత్తం చేంజ్ చేయండని విద్యార్థినులు కోరారు. ఈ దృశ్యాలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి.
సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులతో తమ బాధలు చెప్పుకొని భోరున విలపించిన పాలమాకుల గురుకుల విద్యార్థులు https://t.co/wF5Vt7ThV9 pic.twitter.com/51PEfr4dju
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024
ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు చెప్పాలని గురుకుల విద్యార్థినులకు ఫోన్ నంబర్ ఇచ్చిన హరీష్ రావు
పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా తనకు ఫోన్ చేయమని తన ఫోన్ నెంబర్ విద్యార్థులకు ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. https://t.co/oJahdTZfWH pic.twitter.com/2uMqcuisR6
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2024