హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన రైతులకు చీకటి రోజులనే మిగిల్చిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఒక ప్రకటనలో తెలిపారు. పదేండ్ల హయాంలో రైతుల కోసం మోదీ చేసిందేమీ లేదని, దేశంలో ఏ ఒక్క రైతు సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు.
వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో దేశంలోని ప్రతి రైతు ఖాతాలో కనీసం రూ.30 వేలు వేశానని మోదీ చెబుతున్నారని, అది పచ్చి అబద్ధమని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల కోసం రైతులను మభ్యపెట్టాలని ప్రధాని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధర దక్కడం లేదని, పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశంలో రైతులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు.