హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ గడ్డం సమ్మయ్యకు మరోసారి అవమానం ఎదురైంది. మంగళవారం పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల కోసం ప్రొటోకాల్ ప్రకారం అతిథిగా పిలిచిన అధికారులు.. సంబంధిత వీఐపీ పాస్ అందించడంలో నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో వేదిక పైకి పద్మశ్రీ సమ్మయ్య వెళ్తుండగా పాస్ లేదని భద్రతాసిబ్బంది అడ్డుకొన్నారు.
ప్రభుత్వం తరఫున వివిధ శాస్త్రీయ సంగీత కళాకారులకు, కొందరు పేరున్న కళాకారులకు ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానం అందించిన అధికారులు.. పద్మశ్రీ సమ్మయ్యకు ఇవ్వలేదు. నేరుగా ఆఫీస్‌కు వచ్చి తీసుకోవాలని ఫోన్ చేసి చెప్పారు. యక్షగాన కళాకారునిగా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సమ్మయ్య దళితుడు కావడం వల్లే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆయన పద్మశ్రీ అని కార్డు చూపించి మరీ లోపలికి వెళ్లాల్సి వచ్చింది.