హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత శాలువాలనే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండాసురేఖను కోరారు. మంగళవా రం మంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందించారు. స్వచ్ఛమైన నూలుతో తయారుచేసిన శాలువాతో మంత్రిని సత్కరించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ తదితర ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవ ల్లో పాల్గొనే భక్తులకు అందించే శాలువాలు మరమగ్గాలు, మిల్లుల్లో కృత్రిమమైన నూలు తో తయారవుతున్నాయని అంజయ్య వివరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో త యారైన శాలువాల వినియోగం సరైంది కాద ని అన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేనేతరంగానికి మద్దతుగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.