హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పదేండ్ల పాలనపై చర్చించే నైతికత, దమ్ము రేవంత్‌రెడ్డికి లేవని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టంచేశారు. ‘నీకు అమరవీరుల స్తూపమన్నా, అంబేదర్ విగ్రహమ న్నా గౌరవం లేదు. అందుకే మేము ఏ వేదిక వద్దకూ రాము. జూబ్లీహిల్స్‌లోని నీ ఇంటి పకనే ఉన్న ‘పెద్దమ్మ గుడి’కి వస్తాం. ఆ తల్లి సాక్షిగా, గుండె మీద చెయ్యి వేసుకుని సమాధానం చెప్పే దమ్ముందా?’ అని సవాల్ విసిరారు. ఆరు గ్యారెంటీల మోసం, 420 వాగ్దానాల దగా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భ్రాంతి, నిరుద్యోగ భృతి, తులం బంగారం హామీల వైఫల్యాలపై దేనికైనా చర్చకు సిద్ధ మా? అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సభల్లో అర్థం పర్థం లేని సవాళ్లు విసురుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి సినిమాల్లోని డైలాగుల తరహాలో హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
గాంధీ పార్టీలో ‘హిట్లర్’ రాజ్యమా?
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి.. ‘హిట్లర్ నా స్ఫూర్తిదాత, అందుకే హైడ్రా పెట్టాను’ అనడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నదని శ్రవణ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని, గాంధీ సిద్ధాంతాల పార్టీలో ఉంటూ హిట్లర్ రాజ్యాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. పరిపాలన చేతకాక కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. రాష్ట్రాన్ని డెట్ట్రాప్(అప్పుల ఊబి)లో పడేశారని మండిపడ్డా రు. 30 నెలల్లోనే రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని, పోయిన ఏడాదితోపాటు ఈ ఒక ఏప్రిల్‌లోనే ఏకంగా రూ.11 వేల కోట్ల అప్పు తెచ్చారని విమర్శించారు. కేటీఆర్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫాక్స్‌కాన్ వంటి 500 కంపెనీలను తెచ్చి గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్‌ను నిర్మిస్తే.. రేవంత్‌రెడ్డి దాన్ని ‘డిమాలిషన్ క్యాపిటల్’ (కూల్చివేతల రాజధాని)గా మార్చారని విమర్శించారు.
తెలంగాణను మూడు ముకలు చేస్తావా?
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల సీఈవోలను జైల్లో వేస్తానని బెదిరించి ఎల్అండ్టీ వంటి సంస్థలను తరిమేశారని, ఫార్మాసిటీ భూసేకరణను రద్దు చేసి తన రియల్ ఎస్టే ట్ దందాల కోసం వాడుకుంటున్నారని దాసో జు ఆరోపించారు. రేవంత్ ప్రకటించిన 8.5 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఎంత శాతం నిజమైందో చెప్పాలని, పారదర్శకత కోసం కేటీఆర్ పెట్టిన రియల్ టైమ్ డాష్ బోర్డ్‌ను ఎందు కు బంద్ చేశారని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌గారు ఒక బాధ్యత కలిగిన ఆడపిల్ల తండ్రిలా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తే.. దాన్ని వడ్డించిన విస్తరిలా సర్వనాశనం చేశావు. రాష్ట్రాన్ని క్యూర్, రేర్, ప్యూర్ అని మూడు ముకలు చేశారు. అది ఫ్యూచర్ సిటీ కాదు.. రేవంత్ ఫోర్ బ్రదర్స్ సిటీ. ఫ్యూచర్ సిటీ పేరుతో 2 లక్షల ఎకరాలపై రేవంత్ కన్నేశారని, ఆయన లక్ష్యం దోపిడీ, రియల్ ఎస్టేట్ దందాలే’ అని ఆరోపించారు.
బాల్క సుమన్‌కు పరామర్శ
సింగరేణిని అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించిన దళితబిడ్డ, మాజీ ఎంపీ బాల్క సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను మంగళవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, సీనియర్ నాయకులు విజయ్, ఏనుగు రవీందర్‌రెడ్డి, న్యాయవాది లక్ష్మణ్‌తో కలిసి ములాఖత్‌లో పరామర్శించారు. అనంతరం దాసోజు మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులతో నిర్బంధంలో పెట్టినప్పటికీ బాల్క సుమన్ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా సింగరేణి కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుర్భాషలాడిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేసులు నమోదు కాలేదని, కేవలం బొగ్గుగని కార్మికుల కోసం బాల్క సుమన్ మాట్లాడిన చిన్న పరుష మాటపై కేసులు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు.