హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఉద్యానపంటల సాగులో నూతన ఆవిషరణలతో నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి రైతు లోకసాని పద్మారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుంకుడు చెట్టును తోటపంటగా చేపడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రత్యేకంగా నూతన వంగడాన్ని సృష్టించిన రైతు.. కుంకుడు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాడు. కుంకుడు కాయల నుంచి ఉత్పత్తి చేసే పౌడర్‌తో టూత్‌పేస్టులు, సబ్బులు, నూనెలు తయారు చేస్తున్నాడు. 1991లో 10 ఎకరాల్లో కుంకుడు సాగు ప్రారంభించిన పద్మారెడ్డి.. ఎకరానికి 100 మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు 250 నుంచి 300 కిలోల కాయల చొప్పున ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుమతి వస్తుండగా..
కిలో సరాసరి రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు. కుంకుడు కాయల గుజ్జు, పొడితో అత్యధిక నూనెశాతంతో కొత్త కోణాన్ని చూపించారు. తన నర్సరీలో పెంచిన మొక్కలను ఛత్తీస్‌గఢ్ అటవీశాఖ దిగుమతి చేసుకుంటుంది. పేస్ట్, సబ్బులను నాబార్డ్ ద్వారా విక్రయిస్తున్నారు. పద్మారెడ్డి అభివృద్ధి చేసిన కుంకుడు వంగడాన్ని న్యూఢిల్లీలోని ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్‌లో నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కుంకుడు నూనె ఉత్పత్తులు షాంపూగా ఉపయోగించడంతోపాటు పేస్ట్ మధుమేహ రోగులకు వరంగా ఉపయోగపడుతున్నది. వీటికి పేటెంట్ కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నాడు.
కుంకుడు తవుడులో 48.36 శాతం ఓలిక్ ఆమ్లం, 19.4ఆల్ఫాలినో లెనిక్ ఆమ్లం, 9.89 స్టీరిక్ ఆమ్లం, 8.5 పాల్మిటిక్ ఆమ్లం, 4.71అరాకిడిక్ ఆమ్లం, 1.93 శాతం ఐకోసాఫెన్ టెన్నిక్ ఆమ్లం ఉన్నాయి. కొవ్వు ఆమ్లాలు 24.15 శాతం, మోనో అన్నాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 50.15, పాలీ అన్నాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 21.35 శాతం నమోదయ్యాయి.మొత్తం అన్నాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ 71.51 శాతం ఉన్నాయి.
లోకసాని పద్మారెడ్డి తన కుంకుడు తోటలోని కుంకుడుకాయలను సేకరించి రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో అనాలసిస్‌కు ఇచ్చారు. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. కుంకుడు పొడిలో క్రూడ్ ప్రొటీన్ 6.96 శాతం, బూడిద 2.83 శాతం, సపోనిన్ 19శాతం కనిపించాయి. 100 గ్రాముల పౌడర్‌లో 0.46 మిల్లీగ్రాముల టానిన్లు, 58.13 మిల్లీగ్రాముల ఫినాల్స్ ఉన్నాయి. కిలో కుంకుడు పౌడర్‌లో 895 మిల్లీ గ్రాముల కాల్షియం, 32.84 మిల్లీ గ్రాముల ఇనుము ఉన్నాయి.