మెదక్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : సింగూర్ జలాలు(Singur water) ఘన్పూర్ ప్రాజెక్టుకు వదిలేవరకు పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగూరు జలాలు ఘన్పూర్ కు వదలాలని మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వ్యవసాయానికి సింగూరు జలాలు వదలకపోవడంతో రైతులు పంటలు సాగు చేయని పరిస్థితి నెలకొందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సింగూరు జలాలు ఘన్పూర్ ప్రాజెక్టుకు వదిలి రైతులు రెండు పంటలు సాగు చేసేందుకు ప్రోత్సహించారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష గట్టి సింగూర్ జలాలు ఘన్పూర్కు వదలడం లేదని ఆరోపించారు. రైతులకు రైతు బీమా, రైతు భరోసా ఇవ్వడకు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు కాదు కదా 13 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు పంటలు పండించే పరిస్థితి లేదన్నారు. రైతులకు ఎరువులు సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.