Padma Devender Reddy | అభివృద్ధిలో పోటీపడాలని.. విగ్రహాలను మార్చడంలో కాదంటూ రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డితో పాటు బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాల
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను తీసేసి కేవలం చెయ్యి గుర్తు కోసమే తెలంగాణ అస్థిత్వమైన బతుకమ్మ, కిరీటం తీసేసి విగ్రహాన్ని మార్చారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన బతుకమ్మ ఆనవాలు లేకుండా చేశారని ఆరోపించారు. రజాకార్ల పాలన, ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ తల్లి దైవ స్వరూపినిగా, శక్తి స్వరూపిణిగా తీర్చిదిద్ది చర్చల తర్వాత.. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆమోదం పొందిందన్నారు.
చిన్నచిన్న గ్రామాలకు చెందిన వాళ్లు వివిధ సంఘాలకు చెందిన వాళ్లు చందాలు వేసుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని గుర్తు చేశారు. దేశంలో ఆలిని మార్చిన వారిని చూశాం.. కానీ, తల్లిని మార్చిన వారిని చూడలేదన్నారు. దానికి తేరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి కోసం తీసుకొచ్చిన జీవోను అంగీకరించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాబోయే కాలంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రజలు మమేకమై ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా కార్యకర్తలు, సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డెక్కారని ఆరోపించారు. రైతులను నిండా మంచుతూ ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదన్నారు. విగ్రహాలు మార్చడంలో ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలపై దృష్టి సారించి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. శాసనసభ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండ కడతారన్నారు.