చిన్నశంకరంపేట, జూలై 7 : ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనోహరాబాద్ మండలం రంగాయపల్లిలో ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమంలో వినతిపత్రాన్ని అందించడానికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకొని ప్రతాప్‌రెడ్డిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతాప్‌రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. పోలీసుల పహారా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల మధ్య జరుగాలని సూచించారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. అవసరమైతే హైకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. పరిశ్రమ విస్తరణకు అనుమతులిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తంచేశారు. ఒంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతామని హెచ్చరించారు.