హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘మూసీ నిర్వాసితుల ఇండ్లపై ఆర్బీ (రివర్ బెడ్) అని రాస్తున్నరు.. అది ఆర్బీ కాదు.. రేవంత్ బుల్డోజర్’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి సైకో సీఎంలా తయారయ్యాడని, శాడిస్టులా మారి పేదల ఇండ్ల మీద పడ్డాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మూసీ సుందరీకరణను రూ.16 వేల కోట్లతో ప్రతిపాదించామని గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు), బ్రిడ్జిలు కట్టామని పేర్కొన్నారు. ‘హరీశ్‌రావు, కేటీఆర్‌ల వీపు చింతపండు అవుతదంటున్నరు.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఇండ్లు కూలగొడుతున్న ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా రావాలి.
ఎవరి వీపు చింతపండు అవుతదొ చూద్దాం. రేవంత్‌రెడ్డి వీపు చింతపండు కాదు పుచ్చపండు అవుతుంది’ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ మీద, బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరూ ఇక్కడ లేరని స్పష్టంచేశారు. బులోజర్ రాజ్ చెల్లదని ఓ వైపు రాహుల్‌గాంధీ అంటుంటే, మరోవైపు రేవంత్‌రెడ్డి అదే బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చుతున్నాడని ధ్వజమెత్తారు. ఇకడి కూల్చివేతలపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పేదల కండ్లలో రక్తం చూస్తున్న రేవంత్‌రెడ్డికి పేదల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. పేదలను కాపాడుకొనే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని చెరువుల పరిధిలో కూడా సర్వే పేరిట పేదల ఇండ్లకు రెడ్ మార్ చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో ఒక ఇల్లు కూల్చినా హుజూరాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని, మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, తప్పుచేసే అధికారులను విడిచిపెట్టబోమని చెప్పారు. ఇండ్లు కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశాలున్నా అందుకు విరుద్ధంగా చెరువుల ఆక్రమణల పేరిట కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సైకో సీఎంను కుర్చీనుంచి దింపుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చిరుమళ్ల రాకేశ్‌కుమార్, మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలు, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.