హైదరాబాద్ : రామగుండం(Ramagundam) ఫ్లై యాష్( Fly ash) తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బూడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు రూ.50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న 13 లారీలను తానే స్వయంగా పట్టుకున్నట్లు తెలిపారు.
రవాణా శాఖ అధికారులు రెండు లారీలను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎన్టీపీసీ(Ntpc) అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడే అందరి పేరు రెడ్ బుక్‌లో రాస్తున్నాం, మేం అధికారంలోకి వచ్చిన నాడు అందరి బండారం బయటపెడుతామన్నారు. ఇది బెదిరింపు కాదు, మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. అక్రమార్కులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.