హుజూరాబాద్, జూలై 23: తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ అర్చక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ శంఖారావానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. అయ్యగార్లు చాలా గొప్ప మనుషులని, గుడికి ఎంత గొప్పవారు, పేదవారు, మధ్యతరగతి వారు వచ్చినా వాళ్ల కుటుంబం బాగుండాలని ఆశీర్వదిస్తారని కొనియాడారు. తెలంగాణ రాక ముందు ఈ ప్రాంతాన్ని, దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బ్రాహ్మణులకు చేసింది శూన్యమని, సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే 60 ఏండ్ల అభివృద్ధి చేశారని, బ్రాహ్మణులకు అండగా నిలిచారని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో 35 వేల గుడులు ఉంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యాలకు కేవలం రూ.2,500 నుంచి రూ.3 వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక 12,500 గుడులు ఉంటే సీఎం కేసీఆర్ తొలుత రూ.6 వేలు ఇచ్చారని, ఆ తర్వాత రూ.10 వేలకు పెంచారని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణులు ఏండ్లుగా కోరినా ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ 2017లో రూ.300 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గుడులు, బ్రహ్మణుల గురించి సీఎం కేసీఆర్ ఆలోచించినంతగా దేశంలో మరెవరూ ఆలోచించరని, దీనికి యాదిరిగుట్ట పునర్నిర్మాణమే నిదర్శనమని పేర్కొన్నారు.
మూడోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత వేములవాడ, కొండగట్టు, భద్రాచలం గుడులను అద్భుతంగా తీర్చిదిద్దుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు వల్లూరి పవన్‌కుమార్, అర్చక సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రాచార్యులు, అర్చక సంఘం ఉద్యోగ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖరశర్మ, బ్రహ్మణ సేవాసమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణుదాసు గోపాల్‌రావు, నాయకులు పీవీ ప్రభాకర్ రావు, సంపత్‌రావు పాల్గొన్నారు.