మిర్యాలగూడ, నవంబర్ 7: ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సన్న ధాన్యం మిర్యాలగూడలోని మిల్లులకు తరలివస్తున్నది. వానకాలం సీజన్లో ముందస్తుగా బోర్లు, బావుల కింద సాగు చేసిన రైతులు చేతికి వచ్చిన పంటను మిల్లుల వద్ద అమ్ముకునేందుకు తీసుకువస్తున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో 80 రైస్ మిల్లులు ఉండగా, ప్రస్తుతం 45 మిల్లుల్లో సన్న ధాన్యం విక్రయా లు ప్రారంభించారు. సన్న రకాల్లో హెచ్ఎంటీ, కావేరి చింట్లు, చిట్టిపొట్టి, పద్మ వంటి హైబ్రిడ్ వంగడాలను పొలం మీదే యంత్రాల ద్వారా కోసి మిల్లులకు విక్రయిస్తున్నారు. ఈ ధాన్యం రకాలకు మిల్లర్లు రూ.2,300 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. రైతులు పచ్చి ధాన్యం ఆరబోయకుండా నేరుగా విక్రయించుకుని వెళ్తున్నారు.
బోనస్ కోసం చూస్తే ధాన్యం చెడిపోతది
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో దొడ్డు రకం కొనుగోళ్లకు 260, సన్నాలకు 80 కేంద్రాలను కేటాయించింది. కానీ, సన్న ధాన్యం పండించిన రైతులు ఐకేపీ కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. 17 శాతం తేమ కొర్రీతో కొనుగోలు కేంద్రాల్లో బోనస్ వచ్చే పరిస్థితి లేదు. ధాన్యం ఆరబెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు తలకుమించిన భారంగా మారింది. 20 రోజుల నుంచి వరుస వర్షాలు, వాతావరణం మబ్బులు పట్టి ఉండటంతో ధాన్యాన్ని ఎండబెట్టి ఐకేపీ కేంద్రాల్లో విక్రయించడం కష్టంగా భావిస్తున్నారు. కోసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లుల వద్ద విక్రయించుకుని వెళ్తున్నారు. బోనస్ దక్కకపోయినా రైతులు మిల్లల వద్దకే వెళ్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 85 శాతానికిపైగా రైతులు సన్నరకం వరి వంగడాలను పండించారు. ఈ పంటను యంత్రాలతో కోసి నేరుగా రైతులు మిల్లర్ల వద్దే విక్రయిస్తున్నారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు ఇప్పటివరకు 1.12 లక్షల టన్నులకుపైగా సన్నధాన్యం వచ్చినట్టు మిల్లర్లు చెప్తున్నారు.
సన్నవడ్లను ఆరబెట్టి అమ్మడం కష్టం
కోత మెషిన్‌తో పొలం కోసి మిల్లుకు తీసుకుపోతే అదే అమ్ముకుని ఇంటికి వస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోసం చూస్తే కోసిన పంట పాడయ్యే పరిస్థితి ఉంటుంది. ఐకేపీ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. రూపాయి తక్కువైనా మిల్లులకే వడ్లు అమ్ముతున్నాం.
-మజ్జిగపు సుధాకర్‌రెడ్డి, రైతు, శెట్టిపాలెం
రంగు మారితే మొదటికే మోసం
బోర్ల ఆధారంగా నేను నాలుగెకరాల్లో సన్న వడ్లు పండించాను. రెండు ట్రాక్టర్ల ధాన్యాన్ని మిర్యాలగూడలోని మిల్లులో అమ్మాను. ధర రూ.2,350 ధర పడింది. నిబంధనల ప్రకారం ఐకేపీ కేంద్రాల్లో సన్న వడ్లను ఆరబెట్టి అమ్మడం ప్రయోజనం లేని పని. ఐకేపీ కేంద్రాల్లో పోస్తే ధాన్యం దెబ్బతింటున్నది. రంగు మారితే మొదటికే ముప్పు. ప్రభుత్వం ఇస్తామంటున్న బోనస్ కూడా వస్తుందో, రాదో తెలియని పరిస్థితి. అందుకే మిల్లుకే అమ్ముకున్నా.
-బంటు శ్రీను, రైతు, వేములపల్లి