హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభు త్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత సీజన్లో గురువారం వరకు 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో ఇదే అత్యధిక కొనుగోలు కావడం విశేషం. రాష్ట్రంలో ఇంకా 20 శాతం వరి కోతలు మిగిలి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం ఉన్నది. దీంతో మరో 30-40 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2014-15 వానకాలం సీజన్లో రూ.1,536.85 కోట్ల విలువచేసే 11.03 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 2020-21లో ఏకంగా రూ.9,195 కోట్ల విలువైన 48.74 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొన్నది. ఈ ఏడాది పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ 50 లక్షల టన్నులు దాటడం విశేషం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు వానకాలం సీజన్లలో మొత్తం రూ.44,038 కోట్ల విలువైన 2.47 కోట్ల టన్నుల ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది సీఎం కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ రైతులు సాధించిన విజయమని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు.
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నది. ధాన్యం కొనుగోలు కోసం ఈ సారి 6,846 కేంద్రాలు ప్రారంభించారు. గురువారం వరకు 9 లక్షల మంది రైతుల నుంచి రూ.10 వేలకోట్ల విలువైన 50 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 14 జిల్లాల్లోని 1,982 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తికావడంతో వాటిని మూసివేశారు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో ఈ వానకాలంలో 60 లక్షల టన్నుల ధా న్యం సేకరణకు కేంద్రం అంగీకరించింది. అయితే ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 50 లక్షల టన్నులు కొనుగోలుచేసింది. మరో 30-40 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉండటంతో మొత్తం 90 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మాత్రం 60 లక్షల టన్నులకే అంగీకరించింది. ఈ పరిస్థితిని అంచనావేసే సేకరణ పరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్ స్వయం గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. ఇప్పటివరకూ దీనిపై కేంద్ర మంత్రి స్పందించనేలేదు. ఈ అంశాన్ని శుక్రవారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.