హైదరాబాద్, నమస్తే తెలంగాణ : దశాబ్దాలుగా పడావు పడి నెర్రెలు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం! సాగునీటి గోస తీర్చి రైతుల కన్నీళ్లు తుడిచింది కాళేశ్వరం! తెలంగాణకు జీవధారగా మారి రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని మార్చి.. దేశానికే తలమానికంగా నిలిపింది కాళేశ్వరం! కాళేశ్వరం ప్రాజెక్టు సాక్షాత్కరించిన తర్వాత తెలంగాణలో వ్యవసాయం వర్ధిల్లిందని సాక్షాత్తూ ఇక్రిశాట్ సైంటిస్టులు చేసిన అధ్యయనం సైతం తేల్చిచెప్పింది.
ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని వాదించేవారికి ‘జియో స్పేషియల్ అసెస్మెంట్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్ షిఫ్ట్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ వాటర్ డిమాండ్ ఇన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కమాండ్ ఏరియా, తెలంగాణ’ పేరుతో పబ్లిష్ అయిన రీసెర్చ్ పేపర్ చెంపపెట్టులాంటి సమాధానమిచ్చింది. ఇక్రిసాట్ సైంటిస్టులు ప్రణయ్ పంజాల, డాక్టర్ మురళీకృష్ణ గుమ్మ, వరంగల్ నిట్ ప్రొఫెసర్ శశి మెసపం కలిసి కాళేశ్వరం పరిధిలోని 12 జిల్లాలు, 118 మండలాల్లో రీసెర్చ్ చేసి ఈ నివేదికను రూపొందించారు. దీన్ని అమెరికా, టర్కీ, గ్రీస్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు పరిశీలించి, ఆమోదించారు. ప్రపంచంలోనే అతి పెద్ద, ప్రభావవంతమైన రీసెర్చ్ పబ్లిషర్లలో ఒకటైన ‘ఫ్రంటియర్స్ ఇన్ రిమోట్ సెన్సింగ్’లో ఈ నివేదిక ప్రచురితమైంది.
ఈ అధ్యయనం 12 జిల్లాల పరిధిలో కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు 2018-19లో, కట్టిన తర్వాత 2022-23లో సాగు విస్తీర్ణం, పంటల రకాలు, క్రాప్ వాటర్ డిమాండ్, మేనేజ్మెంట్ తదితర అంశాలపై ఇక్రిసాట్ సైంటిస్టులు అధ్యయనం చేశారు.
జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, మల్కాజిగిరి, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో అధ్యయనం కొనసాగించారు. 2023 మార్చిలో 594 చోట్ల నుంచి నమూనాలను సేకరించారు. గూగుల్ ఎర్త్ ఇమేజినరీ ఐ క్రాప్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మ్యాప్‌లు సేకరించి విశ్లేషించారు. సమాచారం నిజమో? కాదో? నిర్ధారించుకునేందుకు 402 చోట్ల నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన డాటాతో సరిపోల్చారు.
రీసోర్స్శాట్, కార్టోశాట్, సెంటినెట్-2, ల్యాండ్‌శాట్, మోడీస్ తదితర శాటిలైట్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంటల సాగు, విస్తీర్ణం, భూమి వినియోగం వంటి వివరాల మ్యాప్‌లను సేకరించారు. వీటిని రాండమ్ ఫారెస్ట్ (ఆర్ఎఫ్), సపోర్ట్ వెక్టార్ మెషీన్స్ (ఎస్వీఎం), ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ (ఎన్ఎన్) వంటి మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా విశ్లేషించారు. వీటికి అదనంగా స్పెక్ట్రల్ మిక్సర్ మోడల్స్, యాక్సెస్ ల్యాండ్ యూజ్ అండ్ ల్యాండ్ కవర్ (ఎల్యూఎల్సీ) వంటి అధ్యయనాలను పరిగణనలోకి తీసుకున్నారు.
తెలంగాణలోని వ్యవసాయ రంగంపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అద్భుత ప్రభావాన్ని చూపిందని తేల్చారు. ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను మళ్లించడం ద్వారా రాష్ట్ర సాగునీటి, వ్యవసాయ రంగాల రూపురేఖలే మారిపోయాయని స్పష్టంచేశారు.
2018-19, 2022-23 మధ్య పోల్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 118 మండలాల్లో వ్యవసాయ విధానం సమూలంగా మారినట్టు నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆయా మండలాల్లో వరి సాగు 82.1 శాతం పెరిగినట్టు తెలిపింది. 2018-19లో 3,13,929 హెక్టార్లలో వరి సాగుచేయగా, 2022-23 నాటికి 5,71,632 హెక్టార్లకు పెరిగినట్టు పేర్కొన్నది. మెదక్ జిల్లాలో వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగిందని నివేదిక వెల్లడించింది. నాలుగేండ్లలో వరిసాగు విస్తీర్ణం 219 శాతం పెరిగినట్టు పేర్కొన్నది. రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో 75 శాతం నుంచి 134 శాతం వరకు వరిసాగు విస్తీర్ణం పెరిగినట్టు తెలిపింది. నగరీకరణ కారణంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వరిసాగు తగ్గినట్టు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటి లభ్యత పెరిగిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. 6.37 లక్షల ఎకరాల్లో వరిసాగు పెరగడాన్ని బట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా సాగునీటి లభ్యత పెరిగినట్టేనని తేల్చిచెప్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు వంటి జలవనరుల విస్తీర్ణం కూడా పెరిగినట్టు అధ్యయన నివేదిక తెలిపింది. 2018-19లో జలవనరుల విస్తీర్ణం 81,533 హెక్టార్లు ఉండగా, 96,375 హెక్టార్లకు పెరిగినట్టు తెలిపింది. అంటే.. 14,842 హెక్టార్ల మేర (36,675 ఎకరాలు) జలవనరుల విస్తీర్ణం పెరిగినట్టు స్పష్టం చేసింది. అంటే నాలుగేండ్లలో 18.2 శాతం పెరిగాయి. ప్రాజెక్టులో భాగంగా కట్టిన రిజర్వాయర్లు, కాలువలు, అనుబంధంగా పునరుద్ధరించిన చెరువుల ఫలితంగానే జలవనరుల విస్తీర్ణం పెరిగినట్టు నిపుణులు చెప్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ‘క్రాప్వాటర్ రిక్వైర్మెంట్’ (సీడబ్ల్యూఆర్) నాలుగేండ్లలో గణనీయంగా పెరిగినట్టు అధ్యయనం తెలిపింది. ప్రాజెక్టు పరిధిలో 234 శాతం సీడబ్ల్యూఆర్ పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అధ్యయనం చేసిన జిల్లాల్లో 2018-19లో 113.75 టీఎంసీల రిక్వైర్మెంట్ ఉండగా, 2022-23 నాటికి 175.62 టీఎంసీలకు పెరిగినట్టు వెల్లడించింది. మెదక్ జిల్లాలో గతంలో 6.51 టీఎంసీల వాటర్ రిక్వైర్మెంట్ ఉండగా నాలుగేండ్లలోనే ఏకంగా 21.75 టీఎంసీలకు పెరిగినట్టు తేల్చింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా దాని పరిధిలోని మండలాల్లో భూ వినియోగం, వ్యవసాయ విధానాల్లో వచ్చిన గణనీయ మార్పును ఈ అధ్యయన ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగేండ్లలోనే వరిసాగు విస్తీర్ణం 82.1 శాతం పెరగ్గా, వర్షాధారంగా పండించే మొక్కజొన్న, చిరుధాన్యాల నుంచి రైతులు వరి వైపు మళ్లారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెరిగిన సాగునీటి లభ్యత, సరఫరా
వ్యవస్థల మెరుగుదలను నిర్ధారిస్తున్నది. పడావు భూముల విస్తీర్ణం నాలుగేండ్లలో 30.3 శాతం తగ్గింది. ఇది నీటి లభ్యత పెరుగుదల, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లాలవారీగా పరిశీలించినప్పుడు మెదక్ అత్యధికంగా లబ్ధిపొందగా, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి’ అని నివేదిక స్పష్టం చేసింది.
1)సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది.
2)వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది.
3)వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగునీరు సరఫరా చేయగలిగే సామర్థ్యం వచ్చింది.
4)నిరంతర నీటి సరఫరా ఫలితంగా కరువు పరిస్థితులు తొలగిపోయాయి.
సీడబ్ల్యూఆర్ను సాంకేతిక పరిభాషలో క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్గా పిలుస్తారు. సాధారణంగా ఒక ప్రాంతంలో నీటి లభ్యత ఎంత ఉందన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని పంటలు వేస్తారు. రైతులు వేసే పంటల ఆధారంగా నీరు ఎంత అవసరమవుతుందో శాస్త్రవేత్తలు లెక్కగడుతుంటారు. దీన్నే సీడబ్ల్యూఆర్గా పిలుస్తారు. ఏదైనా ప్రాంతంలో సీడబ్ల్యూఆర్ పెరిగినట్లయితే.. ఆ ప్రాంతంలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం పెరిగినట్టే లెక్క.
కాళేశ్వరం పరిధిలో పడావు భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గినట్టు నివేదిక స్పష్టం చేసింది. ఇది ప్రాజెక్టు సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఒకటిగా అభివర్ణించింది. 2018-19లో 7,54,954 హెక్టార్ల మేర పడావు భూములు ఉండగా, 2022-23 నాటికి 5,26,559 హెక్టార్లకు తగ్గినట్టు వివరించింది. అంటే.. 2,28,395 హెక్టార్ల మేర పడావు భూములు సాగులోకి వచ్చాయని స్పష్టం చేసింది. నాలుగేండ్లలోనే నిరుపయోగంగా ఉంచిన భూమి 30.3 శాతం తగ్గినట్టు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సాగునీరు అందించడంతోపాటు రైతుబంధు, రైతుభరోసా, నాణ్యమైన ఉచిత విద్యుత్తు, విద్యుత్తు రంగ సంస్కరణలు వంటివి రైతుల్లో ధైర్యాన్ని పెంచాయని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయాన్ని వదిలి వలసలు వెళ్లిన రైతులు కూడా తిరిగి వచ్చి సాగు మొదలు పెట్టారని, ఫలితంగా పడావు భూములు తగ్గాయని తేల్చిచెప్తున్నారు.
కాళేశ్వరంతో నాలుగేండ్లలో పెరిగిన జలవనరుల విస్తీర్ణం 18.2%
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పెరిగిన గరిష్ఠ సీడబ్ల్యూఆర్ 234.2 %