రంగారెడ్డి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల రైతులు మరోమారు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి, కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ గ్రామాల్లో నేడు పాదయాత్రలకు పిలుపునిచ్చారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఫార్మా సిటీ కోసం అధికారులు గతంలో బలవంతపు భూసేకరణకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ రైతులతో సంబంధం లేకుండా పట్టా భూములను తీసుకుని అందుకు సంబంధించిన పరిహారాన్ని అథారిటీలో జమచేసింది. అయినప్పటికీ పరిహారాన్ని తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూములకు సంబంధించిన లావాదేవీలను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాదు, ఈ భూములకు రైతు భరోసా కూడా ఇవ్వడం లేదు. దీంతో రైతులు మరోమారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల పట్టా భూములను ఫార్మాసిటీ కోసం తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, పట్టా భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. రైతుల సమ్మతి లేకుండా భూమిని తీసుకోవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై రైతులు మండిపడుతున్నారు. భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఫార్మా బాధిత గ్రామాల్లో పర్యటించి తాము అధికారంలోకి వస్తే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను తిరిగి రైతులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని కాంగ్రెస్ తుంగలోకి తొక్కింది.
ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం యాచారం మండలంలోని కురుమిద్ద గ్రామం నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభమవుతుంది. తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాల మీదుగా సాగుతుంది. ఈ యాత్రలో నిషేధిత జాబితాలో తమ భూములున్న రైతులందరూ పాల్గొననున్నారు.
రైతుల ప్రమేయం లేకుండా పట్టా భూములను తీసుకోవడం భూసేకరణ చట్టానికి వ్యతిరేకం. పట్టా భూములను తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టు ఆశ్రయించారు. అయినా, బలవంతపు భూసేకరణతో భూములు తీసుకున్నారు. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపట్టిన భూసేకరణను రద్దు చేయాలి.