ఇల్లెందు, డిసెంబర్ 7 : సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో ఇల్లెందు నుంచి భద్రాచలం వరకు శనివారం పాదయాత్ర చేపట్టారు. ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో సేవాలాల్ రైతు సేన రాష్ట్ర కన్వీనర్ కిషన్‌నాయక్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కుమ్రంభీం విగ్రహాలకు పూలమాల వేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌నాయక్, శివనాయక్ మాట్లాడుతూ రైతుల పంట భూములకు నీరందించాలనే డిమాండ్‌తో యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఈ యాత్ర ఇల్లెందు పట్టణం నుంచి టేకులపల్లి, పాల్వంచ క్రాస్ రోడ్డు, పాల్వంచ పట్టణం మీదుగా సోమవారం ఉదయం భద్రాచలం చేరుకుంటుందని తెలిపారు.
సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సాగర్ ఎడమ కాల్వ జోన్ 3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ కేఆర్ఎంబీ ఉత్తర్వులిచ్చింది. ఆ జోన్‌లోని ఆయకట్టుకు ఇప్పటికే 9.55 టీఎంసీలు వినియోగించుకున్న ఏపీ.. తాజాగా డిసెంబర్ 31 వరకు మరో 15.86 టీఎంసీలు అవసరమని, ఆ మేరకు జలాలు విడుదల చేయాలని ఇటీవల బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అందుబాటులోని నిల్వలు, ఇప్పటివరకు వినియోగించిన నీటి వివరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 3,059 క్యూసెక్కుల చొప్పున 12 టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది.