మహబూబ్ నగర్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ( Palamuru Project ) పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్( BRS ) నాయకులు పాదయాత్ర ( Padayatra ) కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రైతాంగాన్ని, జిల్లా ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లా అత్యధికంగా వలస పోయిన జిల్లా. సాగునీరు ఇస్తే వలసలు తగ్గుతాయాని భావించి బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి 90 శాతం పనులు పూర్తి చేశాం. పది శాతం పనులు పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుంది. మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు వస్తాయని అన్నారు.
కానీ ఇప్పటికి మోటార్లు ఆన్ చేయడం లేదు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నర్లపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని వెల్లడించారు. కేసీఆర్‌ను కలిసి పాదయాత్ర పై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని, జూన్ నెలలోనే పాదయాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, బీఅర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, వాణి దేవి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, వాల్య నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, ఇంతియాజ్, బీఆర్ఎస్ గద్వాల ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు తదితరులు పాల్గొన్నారు.