PACS | టేక్మాల్, ఫిబ్రవరి 15 : అయితే పార్టీ మారు.. లేదంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేయ్.. లేకుంటే అవినీతి ఆరోపణలు.. అధికారుల విచారణలు తప్పవు అంటూ మండల కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ మారకపోవడంతో విచారణ పేరుతో అవినీతిని అంటగడుతున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ యశ్వంత్‌రెడ్డి ఆరోపించారు. సొసైటీలో ఛైర్మన్ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ బలపర్చిన డైరక్టర్లు, నాయకులు ఆరోపిస్తూ సొసైటీ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.
అయితే ఆరోపణల్లో నిజం లేకపోయినప్పటికీ రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి రూ. 23,34,933 అవినీతి జరిగిందని, రికవరీ చేయాలంటూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమమంలో ఛైర్మన్ యశ్వంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప నేతృత్వంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్ బంకు నిర్మాణానికి 2019లో తీర్మానం చేయడం జరిగిందని, 2020లో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తయిన తర్వాత అమ్మకాల కోసం పెట్రోల్‌ను తెప్పించడం జరిగిందన్నారు. అయితే అమ్మకాలకు ప్రభుత్వం నుంచి అనుమతికి 18 నెలలు ఆలస్యం కావడంతో కొనుగోలు చేసిన పెట్రోల్ ధర ప్రారంభించే సమయానికి తగ్గిపోవడం, మిగిలిన పెట్రోల్‌ను లెక్కలోకి తీసుకోకపోవడంతో రూ. 5,14,167 వ్యత్యాసం వచ్చిందన్నారు.
గ్రామంలోని పాత గోదాంకు మరమ్మత్తులు చేయడం, ప్రహరిగోడ నిర్మాణం, సీసీ వేయడం, బోరు వేయడానికి అయిన ఖర్చును కొత్తగా నిర్మించిన భవనం ఖర్చులో విచారణ అధికారులు లెక్కించడం వల్ల రూ. 11,46,325 తేలిందన్నారు. భూమి కొనుగోలుకు రూ.27 లక్షలు ఆరోపించిన దానిలో ఎలాంటి అవతవకలు లేవని తేలిందన్నారు. రుణాలు పొందిన రైతుల నుంచి బ్యాంకు అధికారులు షేర్ అమౌంట్ పది శాతం వసూలు చేస్తారని, అయితే అందులో అధికంగా వసూలు చేయడం వల్ల రూ.4,74,441 అవినీతి జరిగినట్లు వెల్లడించిన దాంట్లో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో బ్యాంకు అధికారులకే బాధ్యత ఉంటుందన్నారు. కేవలం రాజకీయ లబ్ది, పార్టీ మారడం కోసం తనపై చేసిన ఒత్తిడులకు తలొగ్గకపోవడం వల్లనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి విచారణ లేకుండా క్లీన్ చీట్ ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తనపై ఒత్తిడి చేశారని తెలిపారు.
ఎవరెన్ని ప్రలోభాలు, భయాందోళనలు చేసిన తాను పార్టీ మారే అవకాశం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసమే తాను పనిచేస్తానని, ఈ విషయంలో అవసరమైతే సొసైటీ సభ్యులు, రైతుల సమక్షంలో బహిరంగ విచారణకు సిద్దంగా ఉన్నాని తెలిపారు. గత పదేళ్ల తన పదవి కాలంలో దాదాపుగా 5కోట్ల శాశ్వత ఆస్తులను సొసైటీకి సంపాదించానని, రైతులకు అవసరమైన రుణాలను అందిస్తూ 75 శాతం రికవరీతో జిల్లాలోనే అత్యుత్తమ సొసైటీగా గుర్తింపు పొంది, రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సొసైటీగా జిల్లా ఉత్తమ అవార్డును సైతం తమ సొసైటీ సొంతం చేసుకుందన్నారు. గతంలో జిల్లా వ్యాప్తంగా సొసైటీ భవనాలను రూ.5లక్షలతో నిర్మిస్తే, టేక్మాల్‌లో మాత్రం రూ.6.32లక్షతో అప్పటి ఛైర్మన్ అయిన నిమ్మరమేష్ నిర్మించారని, ఆయన నేడు అవినీతినిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దయ్య, సలీం, భాస్కర్, సాయిలు, రవి, సుధాకర్, కిషన్, గోవిందచారి, మోహన్, సాయిబాబా, దుర్గయ్య, శ్రీనివాస్, మొగులయ్య, మాణిక్యం, మల్లేషం, రమేష్, యాదయ్య తదితరులు ఉన్నారు.