హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఏపీలోని ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితుల జాబితాలో తన పేరును సీబీఐ అన్యాయంగా చేర్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టుకు తెలిపారు. పాత చార్జిషీట్లో సాక్షిగా పేరొన్న సీబీఐ తర్వాత అదే చార్జిషీట్లోని అంశాలతో అదనపు చార్జిషీట్ దాఖలు చేయడమే కాకుండా తనను నిందితురాలిగా చేర్చడం అన్యాయమని పేర్కొన్నారు. తాను దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డి గనులశాఖ మంత్రిగా ఉండగా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఓబుళాపురం గనుల కేటాయింపులు జరిగాయని, మంత్రిగా సబిత నిర్వహించిన పాత్ర ఏమిటో సీబీఐకి అవగాహన లేకుండా కేసులో అన్యాయంగా ఇరికించిందని ఆమె న్యాయవాది వాదించారు. విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. ఇదే కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు డిశ్చార్జి పిటిషన్ను కొట్టేయడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేసిన కేసులో సీజే తీర్పును వాయిదా వేశారు.