Ravalkole Lands | మేడ్చల్/మేడ్చల్ రూరల్, జూన్ 12: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తా కథనం సంచలనం సృష్టించింది. ఈ భూముల్లోని సర్వే నంబర్లు 4 నుంచి 18 వరకు 138.53 ఎకరాల్లో వెంచర్లు చేసి విక్రయించారు. ఇప్పుడు ఆ భూములు ప్రభుత్వ ఇనామ్, గ్రేజింగ్ ల్యాండ్‌గా తేలడంతో వాటిని కొన్నవారు షాక్ అవుతున్నారు. రావల్‌కోల్‌లోని 275 ఎకరాల భూ కుంభకోణంలో తమ ప్లాట్లు ఉండటంతో కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ భూములు ఏండ్ల తరబడిగా వివాదంలో ఉండటంతో భూఆక్రమణదారులు వాటిని స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి విక్రయించినట్టు తెలుస్తున్నది. రావల్కోల్ పరిధిలోని 4 నుంచి 18 సర్వే నంబర్లలోని 138.5 ఎకరాల భూమిని సాకి కృష్ణ హౌసింగ్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వెంచర్‌గా చేశారు. ఈ భూమి వెంచర్ యజమానులు పేరిట వివిధ భాగాలుగా ఉన్నది.
వారెవరూ గతంలో ఇనామ్ వారసులుగా లేరు కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చిన ఓఆర్సీ చెల్లుబాటు కాదు. దీంతో నిబంధనల ప్రకారం ప్లాట్ల కొనుగోలుదారుల సేల్ డీడ్ రద్దవుతుంది. భూదందా బయటపడటంతో లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లు తమకు దక్కవని తెలిసి కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులు తమ వద్ద ఉన్న సేల్డీడ్లతో కోర్టులకు వెళ్లినా ఉపయోగం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన 130 మంది రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడున్న మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ.20 కోట్ల దాకా అమ్ముడవుతున్నది. వెంచర్ వంద ఎకరాల్లో ఉండటంతో ప్లాట్ల విలువ రూ.2000 కోట్ల వరకు ఉంటుంది. ఆ భూమి ప్రభుత్వానిదని తేలడంతో రెండు వేల కోట్ల రూపాయలు కొనుగోలుదారులు కోల్పోయినట్టు అవుతుంది. ఏండ్ల తరబడి కష్టపడి పైసాపైసా పోగేసుకుని కొనుగులు చేసిన ప్లాట్లు తమకు దక్కవని తెలిసి కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ పాలనంతా భూదందాలే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి భూదందాలే సాగుతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ప్రభుత్వ పెద్దలు అక్కడ గద్దల్లా వాలుతున్నారు. కబ్జాకోరుల నుంచి కాపాడాల్సిన ప్రభుత్వమే భూమిని కాజేసేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ భూమి ప్రజలకు ఉపయోగపడాలి కానీ పెద్దలు ఆక్రమించుకోవాలని చూడటం సరికాదు. 4 నుంచి 18 వరకు ఉన్న సర్వే నంబర్లలో గతంలోనే వెంచర్ వేశారు. ఆ వెంచర్లో భూములు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటి ?. ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు దిగడం కంచే చేను మేసినట్టుగా ఉన్నది. ఇప్పుడు న్యాయం చేసేది ఎవరు? ఇనాం భూమిని సామాజిక ప్రయోజనాలకు వినియోగించాలి.
– నరేశ్, సీఐటీయూ నేత, రావల్కోల్