హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 510 మంది నిరుపేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ ఆర్థి క సహాయ పథకం కింద రూ. 16.76 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయాలని తెలంగాణ బ్రాహ్మ ణ సంక్షేమ పరిషత్తు నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బొగ్గులకుంట కార్యాలయంలో పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. సమావేశంలో బ్రాహ్మణుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించడంతోపాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన 120 మంది విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేయడంతోపాటు రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 20 మంది పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులకు రూ.2.80 లక్షలను అందజేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. 75 ఏండ్లు పైబడిన ఇద్దరు వేద పండితులకు వేదహిత పథకం కింద నెలకు రూ.2,500 చొప్పున గౌరవభృతి ఇవ్వాలని నిర్ణయించింది.
త్వరలో బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రాహ్మణ సంక్షేమ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. సమావేశంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు వైస్ చైర్మన్ వనం జ్వాలా నర్సింహారావు, సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, పురాణం సతీశ్, డాక్టర్ సువర్ణ సులోచన, సభ్యకార్యదర్శి వీ అనిల్‌కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, రఘురాంశర్మ తదితరులు పాల్గొన్నారు.