Central Universities | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్రప్రభుత్వం దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అత్యంత కీలకమైన ఈ వర్సిటీల్లోని పోస్టులను భర్తీచేయడం లేదు. అక్టోబర్ వరకు జాతీయంగా 5,182 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. 2,750 రిజర్వుడ్ పోస్టుల్లో ఎస్సీ కోటా 740, ఎస్టీ 464, ఓబీసీ 1,546 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవేకాకుండా మరో 3,332 బ్యాక్పోస్టులున్నాయి.
వీటిలో ఎస్సీకి చెందినవి 1,162, ఎస్టీ 776, ఓబీసీ 1,394 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 56 సెంట్రల్ వర్సిటీలుండగా, కొంతకాలంగా వీటిల్లో పోస్టుల భర్తీపై కేంద్రం చోద్యం చూస్తుంది. ఫ్యాకల్టీ కొరత కారణంగా పీహెచ్డీ అడ్మిషన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో గైడ్స్ను కేటాయించలేని పరిస్థితి నెలకొంది. పీహెచ్డీ అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నది. ఖాళీలతోపాటు ఏటా పదవీ విరమణ పొందే వారి సంఖ్య పెరుగుతుండటంతో రీసెర్చ్, బోధన కుంటుపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.