హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రోడ్ల నిర్మాణానికి అడ్డొచ్చే వాగులు, కాలువపై కల్వర్టులు, వంతెనల నిర్మాణం తప్పనిసరి. వాస్తవానికి రోడ్డు నిర్మాణం కన్నా వీటి నిర్మాణానికే ఎక్కువ ఖర్చవుతున్నది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్ విధానం)లో చేపట్టే ఈ రోడ్ల నిర్మాణంలో బ్రిడ్జీల నిర్మాణం సమస్యగా మారింది. వీటి నిర్మాణానికయ్యే అదనపు ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలని ఏజెన్సీలు కోరుతున్నాయి. కానీ, రోడ్ల నిర్మాణం తరహాలో బ్రిడ్జీల నిర్మాణ ఖర్చును ప్రభుత్వం 40%, ఏజెన్సీ లు 60% చొప్పున భరించాలని ప్రభుత్వం చెప్తున్నది. రాష్ట్రంలో 2028 నాటికి రూ.28 వేల కోట్ల వ్యయంతో 17 వేల కి.మీ గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్న ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై ప్రైవేటు ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నది. ఈ విధానంలో రోడ్డు అభివృద్ధికి అయ్యే ఖర్చులో ప్రైవేటు డెవలపర్లు 60% వెచ్చించి 15 ఏండ్లు టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఆ సొమ్మును వసూలు చేసుకుంటారు. కానీ, ప్రభుత్వం మాత్రం టోల్ ట్యాక్స్ విధించే ఆలోచన లేదని, ప్రైవేట్ డెవలపర్లు పెట్టే ఖర్చును దశలవారీగా తామే చెల్లిస్తామని చెప్తున్నది. ఇది బాగానే ఉన్నప్పటికీ హ్యామ్ విధానంలో చేపట్టే రోడ్ల నిర్మాణంలో భాగంగా వాగులు, కాలువలపై కల్వర్టులు, వంతెనలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చుకు ఇది అదనం. దీంతో ఈ ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాల ని నిర్మాణ ఏజెన్సీలు కోరుతున్నాయి. ఈ ఖర్చును కూడా నిర్ధారిత నిష్పత్తిలో ప్రైవేటు డెవలపర్లు భరించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండటంతో సందిగ్ధత నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో గ్రామీ ణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) సహకారంలో నాన్-బీటీ రోడ్లను బీటీ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. రూ.490.91 కోట్లతో 333.77 కి.మీ రోడ్లను, అందులో భాగంగా 50 బ్రిడ్జీలను నిర్మించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణం (ఆర్డీఎఫ్) పథకం కింద రూ.1,053.80 కోట్లతో 1,094.37 కి.మీ రోడ్ల అప్గ్రెడేషన్లో భాగంగా చేపట్టిన 47 వంతెనల్లో 36 వంతెనల నిర్మాణం పూర్తిచేశారు. రైల్వే భద్రతా పనుల్లో (ఆర్ఓబీలు, ఆర్యూబీలు) భాగంగా ప్రధాన లెవల్ క్రాసింగ్ల వద్ద రూ.996 కోట్లతో 31 ఆర్వోబీలు, ఆర్యూబీలు నిర్మించారు. ఇందులో సగం ఖర్చును బీఆర్ఎస్ ప్రభుత్వమే భరించింది. మరో రూ.980 కోట్లు ఖర్చయ్యే 14 ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.