BRS | (ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి): రైతన్న బతుకు అడవిల పడ్డట్టే తయారైంది. పదేండ్లు కేసీఆర్ హయాంలో దేనికీ ఎదరుచూడని రైతన్నకు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే ఏడుపును బహుమానంగా ఇచ్చింది. రుణమాఫీకాక, రైతుబంధు రాక, పంటకు నీళ్లులేక, పండిన పంటను కొనలేక, కరెంటులేక, సమయానికి ఎరువులు, సకాలంలో విత్తనాలు దొరక్క రైతుల కుత్తుకలపై కత్తులై మింగుతున్నాయి. ‘తాగేందుకు పాలు ఇస్తాం. సద్దిలకు పెరుగూ ఇస్తాం. అంతెందుకు కేసీఆర్ కన్నా ఒకటి ఎక్కువే ఇస్తాం’ అని నమ్మబలికిన కాంగ్రెస్ తమను నట్టేట ముంచి బలితీసుకుంటున్నదని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏడాది కాలంలో 400 పైచిలుకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలు దిక్కుతోచనిస్థితిలో దిగులు చెందుతున్నాయి. రైతు బతుకు చిధ్రం అవుతున్న సందర్భంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రైతన్న కుటుంబాలను ధైర్యం చెప్పేందుకు బయలుదేరింది. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలోని ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు అండగా నిలిచింది.
ఆగమైన అడవి జిల్లా
ఆకుపచ్చని అందాలతో అలరారే అడవి జిల్లా ఆగమైపోతున్నది. రైతుల బలవన్మరాలతో అరిగోసపడుతున్నది. స్వచ్ఛమైన మనుషులకు నెలవైన అచ్చమైన గిరిపుత్రులు, అన్నదాతలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితి నెలకొన్నది.
పగవాడికీ రాకూడని కష్టం
బీఆర్ఎస్ పార్టీ నియమించిన కమిటీ శుక్రవారం ఆదిలాబాద్‌లో జిల్లాలో పర్యటించినప్పుడు కడుపుతరుక్కుపోయే సన్నివేశాలు ఎదురయ్యాయి. గుడిహత్నూర్ మండలం నేరడిగొండతండా, బేలమండలం రేణిగుంటతండాకు చెందిన జాదవ్ దేవ్‌రావ్ సహా మరో కుటుంబానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సారధ్యంలోని కమిటీ సభ్యులు రైతు కుటుంబాలతో మాట్లాడారు. గజానంద్ యువరైతు. ఇద్దరు చిన్నపిల్లలు. భూమినే నమ్ముకున్న కుటుంబం. అప్పు ఇచ్చిన ఆసామి అందరి ముందట ఇజ్జత్ తీసిండని చిన్నబుచ్చుకొని పత్తిచేనులోనే పురుగులమందు తాగి కుప్పకూలికూలిండు అని ఆయన భార్య అనిత తన భర్త మరణానికి దారితీసిన పరిస్థితులు చెప్తూ ఎక్కెక్కి ఏడుస్తుంటే బీఆర్ఎస్ అధ్యయన బృందానికే కాదు.. చుట్టుపక్కల ఉన్నవాళ్లను దుఃఖిత భరితం చేసింది. ఇక ఇటీవల బ్యాంకులో ఆత్మహత్యకు పాల్పడిన మరోరైతు జాదవ్ దేవ్రావ్ది కన్నీటి వ్యథే. వయసు మీదపడుతున్నది.
అప్పటికే తన భార్యకు కిడ్నీ మార్పిడి జరిగింది. భార్య ఆరోగ్యానికి ఖర్చు అయింది. పంట పెట్టుబడికీ చేసిన అప్పూ. పిల్లలు లేకపోవటంతో సాదుకున్న కొడుకును ప్రయోజకుడిని చేయాలనే తపన. అయిద్దనుకున్న రైతు రుణమాఫీ కాలే. రైతుబంధు బంద్ అయిపోయింది. బ్యాం కు అప్పుతోపాటు ప్రైవేట్ అప్పు. దిక్కుతోచని దైన్యం. బ్యాంకులోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఈ ఇద్దరి బ్యాంకు అప్పు 2 లక్షలలోపే. ఇతరేతర సాకులు చూపి ఎగ్గొట్టారు. మరో రైతు మూడు నెలల క్రితం మరణిస్తే ఇటీవలే మాఫీ అయిందని అంటున్నరు. ఇంటి యజమాని మరణిస్తే ఆ ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుంది. కుటుంబం రోడ్డున పడుతుంది. ఇవన్నీ ఆలోచించే రైతుకు భూసంబంధ దుఃఖం ఉండకూడదని కేసీఆర్ హయాంలో పదేం డ్లు తలపోశారు. రైతుబంధు, రైతుబీమాతో కొంతలోకొంత ఆదుకున్నారు. ఏ కారణంచేత రైతు మరణించినా రైతుబీమా రైతు కుటుంబానికి దక్కాలన్న పట్టుదలతో కేసీఆర్ చేసిండు.. ఇప్పుడు మాకా ఆదెరువు కరువైంది. ‘నిండుగా నీళ్లున్న కుండ మీద బండను పడేసుకున్నట్టు అయింది మా బతుకు’ అని రైతులు దిగులు చెందుతున్నరు.
ఎదురుచూడని ఎవుసానికి చావు ఎదురుతెచ్చుకున్నం
ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇవ్వటం, రైతుల స్థితిగతులను అధ్యయనం కోసం బీఆర్ఎస్ కమిటీ వేసిందని, ఆ కమిటీ తొలిపర్యటన ఆదిలాబాద్ నుంచే మొదలు అవుతుందని తెలుసుకున్న రైతాంగానికి భరోసా దొరికినట్టు అయిందని శుక్రవారం చోటుచేసుకున్న వాతావరణం స్పష్టం చేసింది. కమిటీ పర్యటించే గ్రామాలే కాకుండా సమీప గ్రామాల నుంచి రైతులు ఆసక్తిచూపారు. ఎవరకి వారుగా రైతులు, వ్యవసాయకూలీలు, కౌలు రైతులు తమ గోడును వెల్లబోసుకోవటానికి స్వచ్ఛందంగా తరలివచ్చారు.
రైతుల్లో కొండంత ధైర్యం
ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుకుటుంబాల వైపు కాంగ్రెస్ సర్కార్ కన్నెత్తి చూడలేదు. పల్లెత్తు హామీ ఇవ్వలేదు. తామేం చేయకపోయినా.. తమ పరిస్థితిని చూసి బీఆర్ఎస్ కదిలివచ్చిందని ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలే కాకుండా రైతాంగం భావిస్తున్నది. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అండగా ఉండటమే కాకుండా దిక్కుతోచని ఎవుసానికి మళ్లీ జీవగర్రగా కేసీఆర్ రావాలని రైతులు బలంగా ఆకాంక్షిస్తున్నారని ఆదిలాబాద్ చెప్పకనే చెప్పింది. మళ్లీ సార్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని రైతులు నిశ్చితాభిప్రాయానికి వస్తున్నారు.