హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ) : సుంకిశాల రిటెయినింగ్ వాల్ కుప్పకూలి 20 నెలలు దాటింది. కానీ నేటికీ ఆ పథకం పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలోనే 80 శాతానికి పైగా పనులు పూర్తయినా రెండున్నరేండ్ల నుంచి మిగిలిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. వరుసగా మూడేండ్లు కరువు వచ్చినా నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ మహానగర తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండొద్దనే సంకల్పంతో కేసీఆర్ సుంకిశాల తాగునీటి పథకాన్ని చేపట్టారు. జలమండలి ఇంజినీర్లు అంతా తామై పథకాన్ని ముందు కు తీసుకుపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు శరవేగంగా సాగిన పనులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా గాడి తప్పాయి. చివరికి మరికొంత కాలంలోనే పథకం అందుబాటులోకి వస్తుందనుకున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పర్యవేక్షణలోపంతో కుప్పకూల్చింది.
తప్పుడు అంచనాతో ఘటనకు తమదే బాధ్యత అని నిర్మాణ ఏజెన్సీ మేఘా ఇన్ఫ్రా ప్రకటించడమంటే జలమండలి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపమే ప్రధాన కారణమని స్పష్టమవుతున్నది. ఘటన జరిగిన తర్వాతనైనా అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ‘ఈ చిన్న ఘటనపై రాద్ధాంతం ఎందుకు?’ అని ఘటన జరిగిన సమయంలో సాక్షాత్తు మంత్రులే ప్రకటించారు. నిజంగా అది చిన్న సంఘటనే అయితే 20 నెలలు దాటినా పునరుద్ధరణ ఎందుకు జరుగలేదు? ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పథకం పూర్తయి అందుబాటులోకి వస్తుందని అధికారులు ప్రకటించినా అసలు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఎందుకు నెలకొన్నది? పునరుద్ధరణ పనులు మొదలవడం దేవుడెరుగు.. ఘటన జరిగిన దాదాపు రెండేండ్లకు ఐఐటీ మద్రాస్‌తో పథకంపై అధ్యయనం చేయించాలని జలమండలి నిర్ణయించడం వెనుక రంధ్రాన్వేషణతో పథకాన్ని అటకెక్కించే ప్రమాదమేమైనా పొంచి ఉన్నదా? అని నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 524.5 అడుగుల నీటిమట్టం ఉన్నది. 510 అడుగుల నీటిమట్టం వరకు హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఢోకా ఉండదు. అంతకంటే తక్కువ నీటిమట్టానికి చేరుకుంటే క్రమంగా నగరానికి వచ్చే నీటి సరఫరాలో కోత పడుతుంది. పైగా మంగళవారం జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీ, తెలంగాణకు సాగర్ నుంచి నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అంటే రానున్న 15 రోజుల్లో నీటిమట్టం వేగంగా తగ్గుతుంది. అసలే ఎల్‌నినో ప్రభావం అనే అంచనాల నేపథ్యంలో మున్ముందు పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లోనూ నగరానికి వచ్చే కృష్ణాజలాలకు కించిత్తు అంతరాయం కలుగకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల తాగునీటి పథకాన్ని చేపట్టింది. పథకం పనులు బీఆర్ఎస్ హయాంలోనే 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ వచ్చాక దీనిపై పెద్దగా దృష్టిసారించలేదు. ఫలితంగా 2024, ఆగస్టు రెండో తేదీన పంపుహౌస్‌లో రిటెయినింగ్ వాల్ కుప్పకూలింది. ఘటన జరిగిన తర్వాత అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం ఇదో చిన్న ఘటన అని కొట్టిపారేసింది. ఆపై నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకొన్నది. నాగార్జునసాగర్‌లోకి వస్తున్న వరద ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయకుండా పంపుహౌస్‌లోకి టన్నెల్‌ను తెరిచామని, ఈ ప్రమాదానికి తమ తప్పుడు అంచనాయే కారణమని, పునరుద్ధరణ వ్యయాన్ని తామే భరిస్తామని నిర్మాణ ఏజెన్సీ మేఘా ఇన్ఫ్రా అప్పట్లో ప్రకటించింది. కానీ తర్వాత ఆ దిశగా సరైన కార్యాచరణ అమలు కాలేదు.
సుంకిశాల ఘటన చిన్నది. అది సరిదిద్దుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇంజినీర్లు, ఏజెన్సీ వాళ్లు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు.
– సుంకిశాల రిటెయినింగ్ వాల్
కూలిన సందర్భంలో అక్కడికి వెళ్లిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల చేసిన వ్యాఖ్యలివి!
కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన ఈ పథకాన్ని పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదనేది ఘటన జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తేటతెల్లమైంది. ఎస్సెల్బీసీ సొరంగం పూర్తయితే గ్రావిటీ మీద కృష్ణాజలాలు వస్తాయని, తద్వారా సుంకిశాల ఎందుకనే అభిప్రాయం కూడా ప్రభుత్వ గమనంలోకి రావడంతో చాలాకాలం పాటు తాత్సారం చేసింది. ఎస్సెల్బీసీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో ఐదో మోటర్‌ను తెరపైకి తెచ్చారు. సుమారు రూ.150-200 కోట్ల వ్యయాన్ని జలమండలి భరిస్తే ఐదో మోటర్ ఏర్పాటు చేయవచ్చని నీటిపారుదల శాఖ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. సాగర్‌లో 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే మోటర్ నడిచే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ చేపట్టిన సుంకిశాల పథకమే నగర నీటి సరఫరాకు శ్రీరామరక్ష అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించక తప్పలేదు.

ప్రత్యామ్నాయ దారులన్నీ మూసుకుపోవడంతో సుంకిశాల పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని ఎట్టకేలకు జలమండలి నిర్ణయించింది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి, కార్యాచరణ కూడా రూపొందించారు. పంప్‌హౌస్‌లో కుప్పకూలిన రిటెయినింగ్ వాల్ శిథిలాలను తీసివేసి, డీవాటరింగ్ ప్రక్రియ ద్వారా అందులో నీటిని తొలగించారు. భారీ సాగునీటి ప్రాజెక్టులకు గేట్లు అమర్చడంలో నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడిని తీసుకువెళ్లారు. సాగర్ జలాశయం నుంచి నీరు నేరుగా టన్నెల్ నుంచి పంపుహౌస్‌లోకి కాకుండా జలాశయం వద్దనే నియంత్రణ ఉండేలా గేట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి వరకు పంపుహౌస్‌లో సివిల్ పనులన్నీ పూర్తవగా పైపులైన్ పనుల్లో 54.30 కిలో మీటర్లకుగాను ఇంకా 8.30 కిలోమీటర్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఎలక్ట్రో మెకానికల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పంపులు, మోటర్లు కూడా ఎప్పుడో వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ.1,321.18 కోట్ల పనులు పూర్తి కాగా నిర్మాణ ఏజెన్సీ మేఘా ఇన్ఫ్రాకు రూ.1,297.68 కోట్ల చెల్లింపులు కూడా జరిగినట్టు జలమండలి అధికారులు తెలిపారు. కానీ కీలకమైన పంపులు, మోటర్ల బిగింపు మాత్రం మొదలుపెట్టలేదు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకానికి (ఎస్సెల్బీసీ) రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే కృష్ణాజలాలు అక్కంపల్లి రిజర్వాయర్‌లో వచ్చిపడుతయ్. కేసీఆర్ ఈ సుంకిశాల పథకాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారో అర్థం కావడం లేదు. ఇది అనవసర ప్రాజెక్టు.
– సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిన సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి!
సుంకిశాల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేగంతో 2024, వేసవి వరకు పూర్తి కావాలి. కానీ రిటెయినింగ్ వాల్ కుప్పకూలడంతో ఆలస్యమైందనుకున్నా పోయిన సంవత్సరం వేసవిలోగా అందుబాటులోకి రావాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వేటలో సుంకిశాలను అటకెక్కించేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో మరింత ఆలస్యమైంది. చివరికి జలమండలి అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రకారమే గత ఏప్రిల్‌లో సుంకిశాల పథకం అందుబాటులోకి రావాలి. కానీ పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. ముఖ్యం గా పంపుహౌస్‌లో పునరుద్ధరణ పనులు కాకుండా జలమండలి అధికారులు పూట కో ప్రతిపాదనను తెరపైకి తెస్తుండటం అం దరినీ విస్మయానికి గురిచేస్తున్నది. నిరుడు సాగర్ జలాశయం వైపు టన్నెల్న్కు గేట్లు బిగిస్తామని చెప్పారు. ఇప్పుడు ఐఐటీ మద్రాస్‌తో అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్టుగా జలమండలి అధికారులు ప్రకటించారు.
ఈ మేరకు నిర్మాణ ఏజెన్సీ మేఘా ఇన్ఫ్రా రూ.4 కోట్లు భరించేలా ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి ఆమో దం వచ్చిన తర్వాత నెలకు పనులు మొదలవుతాయని స్పష్టం చేశారు. అయితే సుం కిశాల పథకం డిజైన్‌పై రివ్యూ, విశ్లేషణ, సూచనలు ఇవ్వడం, ఇన్‌టేక్‌వెల్ గోడల మధ్య ఉన్న గ్యాప్‌లను పూడ్చడం, వివిధ రకాల పరీక్షలే కాకుండా సామర్థ్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడం వంటి ప్రక్రియలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నది. రిటెయినింగ్ వాల్ కు ప్పకూలి 20 నెలలు దాటింది. మరి ఇప్పు డు అధ్యయనాలు చేయించడమేందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా ఐఐటీ మద్రాసు అంగీకరించిన తర్వాత నెల రోజులకు పనులు మొదలుపెడితే పథకం పూర్తయి, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తానికి ఈ వేసవిలో సాగర్ నీటిమట్టం బాగా తగ్గితే ఈసారి కూడా హైదరాబాద్ తాగునీటి సరఫరా అత్యవసర మోటర్లపైనే కొనసాగనున్నదనేది ఖరారైంది.