హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న దాదాపు 17 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. పెండింగ్ వేతనాలను కొంతమేర విడుదల చేసింది. ఏఎన్ఎంలకు రెండు నెలలు, ఇతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు శుక్రవారం నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీనిపై వైద్యారోగ్య శాఖ స్పందించింది. ఏఎన్ఎంలకు ఒక నెల, ఇతర సిబ్బందికి రెండు నెలల వేతనాలను జమ చేసింది. ఈ నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్టు తెలంగాణ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎం యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామల, కోశాధికారి జై పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి, తన్వీర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.