TG EAPCET | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో 11,638 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లోనే అత్యధికంగా మిగిలిపోయాయి. టీజీఎప్‌సెట్-25 తుది విడత సీట్ల కేటాయింపు ఫలితాలు ఆదివారం విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ tgeapcet.nic.inలో వివరాలు అందుబాటులో ఉంచారు. తుది విడతకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 6న పూర్తిచేశారు. 6, 7 తేదీల్లో వెబ్ఆప్షన్ల ప్రక్రియను ముగించారు.
ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 12లోగా ఫీజు చెల్లించి, సోమవారం నుంచి ఈ నెల 13 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. లేదంటే సీట్ల కేటాయింపు రద్దయ్యే అవకాశం ఉంటుందని టీజీఎప్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తం 97,369 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఇందులో 40,837 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, 91,649 సీట్లలో 80,011 సీట్లు కేటాయించారు. 11,638 సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలో 100% అడ్మిషన్లు పొందిన కాలేజీలు 51 ఉన్నాయి. ఇందులో 5 యూనివర్సిటీలు కాగా, 46 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.