హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) స్కీమ్‌లో 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17,541 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వీరంతా పల్లె దవాఖానా, యూపీహెచ్‌సీల్లో వైద్యులుగా, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, సెకండ్ ఏఎన్ఎం, కాంటిజెంట్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం మెరుగుదలకు పాటుపడుతున్న తమకు ప్రభుత్వం మూడు నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు ఉద్యోగులు వాపోయారు. వెంటనే ప్రభుత్వం చొరవ చూపి తమకు జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.