వేములవాడ, సెప్టెంబర్ 25: దేవాదాయశాఖ ఉద్యోగులకు ఇప్పటికే నాలుగు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం మూడింటిని ఈ పండుగలోగా విడుదల చేయాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, 261 జీవోను సవరించి ఉద్యోగులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి న్యాయం చేయాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని హోటల్ ఎస్ఆర్ఆర్ గ్రాండ్లో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. దేవాదాయ శాఖలో 1975 నాటి క్యాడర్ స్ట్రెంత్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆలయాల్లో భక్తుల రద్దీ, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఐదేండ్లకోసారి క్యాడర్ స్ట్రెంత్‌ను రివైజ్ చేయాలని సూచించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. 317జీవో తీసుకొచ్చి జోనల్ వ్యవస్థలో బదిలీచేసి ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని చెప్పారు.