హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం ఏఐ విప్లవంతో ప్రపంచం దూసుకెళ్తున్నా రాష్ట్రంలో మాత్రం ఇంకా అనేక గ్రామాలు సర్కార్ విద్యకు నోచుకోవడం లేదు. వేలాది ఊళ్లు బడికి దూరంగా ఉండటంతో ఎంతోమంది కనీసం ప్రాథమిక విద్యను కూడా అందుకోలేకపోతున్నారు. నిబంధనల ప్రకారం ఆవాసాలకు కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్లలోపు ప్రాథమికోన్నత, ఐదు కిలోమీటర్ల లోపు సెకండరీ, 7కిలోమీటర్ల లోపు సీనియర్ సెకండరీ బడులుండాలి. కానీ రాష్ట్రంలో ఏకంగా 3,241 గ్రామాల్లో హైస్కూళ్లు లేవు. మరో 7,604 గ్రామాలకు సీనియర్ సెకండరీ విద్య అందుబాటులో లేదు. ఈ గ్రామాలే కాకుండా పరిసర గ్రామాల్లోని విద్యార్థుల చదువుల కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. 2025-26 విద్యాసంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
బడులను కుదిస్తే మరింత నష్టం
వాస్తవ పరిస్థితులిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బడులను కుదించేందుకు సిద్ధమవుతున్నది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ప్రకటించారు. రాష్ట్రంలో 2వేలకు పైగా క్లస్టర్ స్కూళ్లున్నాయి. అంటే ఒక క్లస్టర్లో రెండు స్కూళ్లు మాత్రమే ఉండబోతున్నాయి. 4వేలకు కుదిస్తే విద్యార్థులు రోజుకు కనీసంగా 10కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే మండలానికి మూడు పబ్లిక్ స్కూళ్లు, నాలుగు ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ఒక్కో పబ్లిక్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 1,500 ఉండాలని కమిషన్ పేర్కొన్నది. 4వేలకు కుదించాలన్న సర్కార్ ఆలోచన వెనుక ఇదే జరుగబోతున్నదని విద్యావేత్తలు అనుమానిస్తున్నారు. పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్ల పేరిట మిగతా బడులను మూసివేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
విద్యార్థులెక్కడ..?
ఒక మండలంలోని పబ్లిక్ స్కూళ్లలో 4,500 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. మండలానికి నాలుగు ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేస్తే, ఒక్కోదాంట్లో 250మంది చొప్పున మొత్తం వెయ్యి మంది ఈ బడుల్లోనే చేరుతారు. అంటే ఒక్కో మండలంలో 5,500 మంది పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్లల్లోనే ప్రవేశాలు పొందుతారు. రాష్ట్రంలోని 632 మండలాలుండగా.. మండలానికి 5,500 మంది చొప్పున మొత్తం 34.76లక్షల మంది పబ్లిక్, ఫౌండేషన్ స్కూళ్లల్లోనే చేరుతారని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉన్న విద్యార్థులేమో 50లక్షలు. విద్యాశాఖ లెక్కల ప్రకారం ఇప్పటికే 35లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్ బడుల్లో చదువుతున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న 34లక్షల మంది విద్యార్థులెక్కడ.. ఎక్కడినుంచి వస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 34లక్షల మంది వీటిలోనే చేరితే మిగతా స్కూళ్లల్లో ఉండేదెవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మొత్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులు లేకుండా చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తున్నది.
సర్కార్ బడుల స్థూల లభ్యత నిష్పత్తి
స్థాయి : నిష్పత్తి
ప్రాథమిక : 97.87
ప్రాథమికోన్నత: 99.04
సెకండరీ : 85.39
హయ్యర్ సెకండరీ : 65.73