రఘునాథపాలెం, ఆగస్టు 11 : డబుల్ బెడ్రూం ఎంక్వైరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ కాం గ్రెస్ కార్యకర్త తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్‌ను దూషించిన ఘటన ఖమ్మం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే .. ఖమ్మం నగరం 54వ డివిజన్‌కు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సదరు కార్యకర్త గతంలో నివాసం ఉన్న ప్రాంతంలో లబ్ధి పొందాడా..? అని తహసీల్ ఆఫీస్‌కు ఎంక్వయిరీ లేఖను పంపారు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించినప్పటికీ అనవసరంగా ఎంక్వయిరీ రిపోర్టు పంపించారని, అక్కడి అధికారులు ఇప్పుడు రాలేదంటున్నారంటూ ఆగ్రహంతో ఆ కార్యకర్త డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు వద్దకు వచ్చి దూషించాడు. సిబ్బంది నచ్చజెప్పే యత్నం చేసినప్పటికీ వినకుండా ‘మా నాయకుడు నరేందర్ వస్తేనే మీరు వింటారని.. ఆయన్నే తీసుకొచ్చి మీముందు కూర్చోపెడతా’ అంటూ హెచ్చరించాడు.