హైదరాబాద్: కోల్‌కతాలో రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబ్బంది విధులు బహిష్కరించడంతో హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అత్యవసర సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతున్నాయి.
నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ల వైద్య సిబ్బంది నిరసనల్లో పాల్గొన్నారు. సీనియర్ డాక్టర్లు, జూనియర్ వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విధులను నల్ల రిబ్బన్లు ధరించి వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. గాంధీ, ఉస్మాని దవాఖానల్లో సీనియర్ డాక్టర్లు కూడా విధులను బహిష్కరించడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
కాగా, కోల్‌కతాలో యువ వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బాధితురాలి మర్మాంగాలు, కళ్లు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్లు, చేతులు, గోళ్లకు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్న నిందితుడు తన పోకిరి చేష్టలతో తరుచూ సదరు వైద్యురాలిని ఇబ్బందులకు గురిచేసేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. కాగా వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు. దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి.