హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్’ గ్రేడ్‌ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించిన ఈ సూచీలో తెలంగాణకు చెందిన మరో 22 జిల్లాలు ‘ప్రచేస్త-1’ గ్రేడ్‌ను సొంతం చేసుకోగా.. 6 జిల్లాలు ‘ప్రచేస్త-2’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. అభ్యాస ఫలితాలు, నాణ్యత, పాఠశాలలు-టీచర్ల లభ్యత, మౌలిక సదుపాయాలు, తరగతి గదులను సమర్థంగా నిర్వహించడం, స్కూల్ సేఫ్టీ, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, గవర్నెన్స్ లాంటి మొత్తం 83 అంశాలను పరిగణనలోకి తీసుకుని 600 మార్కులకు ఈ సూచీని రూపొందించారు.
ఇందులో 90% కంటే అధిక మార్కులు సాధించిన జిల్లాలకు ‘దక్ష్’ గ్రేడ్‌ను, 81 నుంచి 90% మార్కులు సాధించిన జిల్లాలకు ‘ఉత్కర్ష్’ గ్రేడ్‌ను, 71 నుంచి 80% మార్కులు సాధించిన జిల్లాలకు ‘అతి ఉత్తమ్’ గ్రేడ్‌ను, 61 నుంచి 70% మార్కులు సాధించిన జిల్లాలకు ‘ఉత్తమ్’ గ్రేడ్‌ను, 51 నుంచి 60% మార్కులు సాధించిన జిల్లాలకు ‘ప్రచేస్త-1’ గ్రేడ్‌ను, 41 నుంచి 50% మార్కులు సాధించిన జిల్లాలకు ‘ప్రచేస్త-2’ గ్రేడ్‌ను కేటాయించారు. 40% కంటే తక్కువ మార్కులు సాధించిన జిల్లాలకు 4 రకాల గ్రేడ్స్ (ప్రచేస్త-3, ఆకాంక్షి-1 ఆకాంక్షి-2, ఆకాంక్షి-3) ఇచ్చారు. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన ఒక్క జిల్లా కూడా లేకపోవడం గమనార్హం. కాగా, 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఈ ర్యాంకింగ్స్‌లో దేశవ్యాప్తంగా 51 జిల్లాలు ‘అతి ఉత్తమ్’ గ్రేడ్‌ను కైవసం చేసుకున్నాయి. ‘ఉత్తమ్’ గ్రేడ్‌ను 271 జిల్లాలు, ప్రచేస్త -1 గ్రేడ్‌ను 290 జిల్లాలు, ప్రచేస్త-2 గ్రేడ్‌ను 117 జిల్లాలు దక్కించుకోగా.. 18 జిల్లాలకు ప్రచేస్త్ర-3 గ్రేడ్, ఒక జిల్లాకు ‘ఆకాంక్షి-1’గ్రేడ్ లభించింది.
Ppp