రంగారెడ్డి, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణ) : ఫార్మా బాధిత గ్రామాల్లోని పట్టా భూములు కలిగిన రైతుల పేర్లను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆ భూములు వారికే ఇప్పిస్తామని మాట ఇచ్చిన మంత్రులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ఫార్మా బాధిత గ్రామాల రైతులు ఆరోపించారు. ఈ మేరకు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ కవుల సరస్వతి, రైతులు శనివారం రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోర్టు కూడా నిషేధిత జాబితాలో నుంచి రైతుల పేర్లను తొలగించాలని ఆదేశించినందున, తమ భూములను ఆన్లైన్లో ఎక్కించి తమకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సుమారు 900 మంది రైతులకు 2,211 ఎకరాల పట్టా భూములున్నాయి. ఫార్మాసిటీకి సేకరించిన భూములకు ఈ భూములు అనుబంధంగా ఉండటంతో వీటిని కూడా తీసుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ రైతులు అంగీకరించలేదు. దీంతో రైతులకు తెలియకుండానే ఈ భూములకు సంబంధించి పరిహారాన్ని అథారిటీలో జమచేశారని, ఈ విషయం తెలియటంతో తాము కోర్టును ఆశ్రయించినట్టు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి ఆర్డీవో పొరపాటున ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని, తిరిగి ఈ భూములను రైతుల పేర్లమీద ఆన్లైన్లో ఎక్కిస్తామని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. ఆ కాపీని కూడా రైతులు కలెక్టర్‌కు అందజేశారు.