Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 6: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్పై ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. వీసీ హోదాలో ఉన్న వ్యక్తి పెద్దన్న పాత్ర పోషించకుండా సాటి అధ్యాపకులపై కక్షగట్టి వేధిస్తున్నారని ఆరోపించింది. అడుగులకు మడుగులొత్తే వారినిఅందలం ఎక్కిస్తున్నారని, ప్రశ్నిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని పేర్కొంది. అధ్యాపకులను వేధించడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపింది. వీసీ చర్యలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని ఔటా నాయకులు గవర్నర్‌ను కోరారు. అభియోగాలు రుజువైతే వీసీపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ల తిరస్కరణ
సాధారణంగా వర్సిటీలలో అధ్యాపకులుగా చేరిన వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అవసరమైన అనుభవం, యూజీసీ నిబంధనల మేరకు పరిశోధనా పత్రాలు, పీహెచ్డీ పరిశోధనలు ఉంటే ప్రమోషన్లు ఇస్తారు. కానీ ఓయూలో ఎన్నడూలేని విధంగా కేవలం ఇంటర్వ్యూ మార్కులను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని 47 మంది అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించారు. ఈ ప్రక్రియలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుస్తున్నది. నిబంధనలు అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు మరొకలా ఉన్నాయని అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్ చాన్స్‌లర్ అడుగులకు మడుగులొత్తేవారికి న్యాయం ఒకలా ఉందని, ఇతరులకు ఇంకోలా ఉందని వాపోతున్నారు. ప్రమోషన్లు దక్కని వారిలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, బెస్ట్ రిసెర్చర్ అవార్డు గ్రహీతలు కూడా ఉండటం.. మరింత అనుమానాలకు తావిస్తున్నదని చెప్తున్నారు. మరోవైపు ప్రమోషన్ల అంశంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై బాధిత అధ్యాపకులు మూడు నెలలకుపైగా రోజూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ఓయూ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.
వర్సిటీలో భయానక వాతావరణం
వీసీ ఏకపక్షంగా జారీచేస్తున్న ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనందుకు తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నారని ఔటా ప్రతినిధులు చెప్పారు. దీంతో క్యాంపస్‌లో భయాందోళన వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఇంటర్వ్యూ, సెలక్షన్ బోర్డులలో వీసీ అభిప్రాయాన్ని వ్యతిరేకించిన వారికి జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు నామమాత్రంగా కమిటీలు వేస్తున్నారని.. కానీ ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని వాపోయారు. అధికార దుర్వినియోగం చేస్తూ సహజన్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. అధికారిక, చట్టబద్ధమైన వేదికలలో అసమ్మతిని వ్యక్తపరచడం దుష్ర్పవర్తన కాదని, అది సంస్థాగత పాలనలో ముఖ్యమైన భాగమని అభిప్రాయపడ్డారు.
మెమోలు, అట్రాసిటీ కేసులు
వీసీ వైఖరిని తప్పుపట్టినందుకు ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్‌కు అధికారులు రెండుసార్లు మెమోలు జారీసినట్టు తెలిసింది. అధ్యాపకుల ఉద్యోగోన్నతుల ఇంటర్వ్యూ బోర్డులో సభ్యుడిగా ఉన్న ఔటా అధ్యక్షుడు.. బోర్డులో సభ్యులతో ముందస్తు సంతకాలు తీసుకోవడాన్ని ప్రశ్నించినందుకు తనకు మెమో జారీ చేశారని తెలిపారు. బోర్డులో వర్సిటీ పరువు తీశానని, ఎగ్జామినర్‌ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని అందులో ఆరోపించారని చెప్పారు. అధ్యాపకులకు ప్రమోషన్లు నిరాకరించడాన్ని నిరసిస్తూ వారికి మద్దతుగా ర్యాలీ తీసినందుకు మరో మెమో జారీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించిన అధ్యాపకులపై ఇలా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని వాపోయారు. మరోవైపు వీసీకి సంబంధించి సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేసిన అధ్యాపకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.
వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైస్చాన్స్లర్పై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని ఔటా ప్రతినిధులు గవర్నర్‌కు విజ్ఞప్తిచేశారు. సీఏఎస్‌లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులుగా ఉన్న అధ్యాపకులకు వారి అర్హతలకు అనుగుణంగా తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వీసీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.