ఖైరతాబాద్, సెప్టెంబర్ 9 : ‘గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడదలు చేసి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి ఉంటే హైకోర్టు ఎందుకు మొట్టికాయలు వేస్తుంది. మొత్తంగా ఇది ఫెయిల్యూర్ సర్కార్’ అని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని ఇప్పటికీ అమలు చేయకుండా రేవంత్ సర్కారు నిరుద్యోగులను నిలువునా వంచించిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3 వేలు, గ్రూప్-4లో 4 వేల చొప్పున ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఎన్నికల ముందు ఇదే ప్రెస్‌క్లబ్‌లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నాడు ప్రగల్భాలు పలికారని, గ్రూప్ 1ను 1:100 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా నిరుద్యోగ యువతను దగా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్యోగాలు ఏవని అడిగితే వెటకారంగా, ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వినతిపత్రాలను అందజేసేందుకు గాంధీభవన్‌కు వెళ్తే అరెస్టు చేశారని చెప్పారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్న నమ్మకం లేకుండాపోయిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను ఒకే వేదికపై తీసుకొచ్చి ప్రభుత్వంపై పోరుబాట చేస్తామని హెచ్చరించారు.
‘ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటుంటే ప్రభుత్వం మాత్రం చాలా ఉద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగులు ఉద్యోగాలొద్దని ధర్నా చేస్తున్నారు’ అంటూ అబద్ధాల చెప్తున్నారని గ్రూప్ 1 అభ్యర్థి ఝాన్సీ మండిపడ్డారు. రోజూ రూ.5 భోజనం చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని, ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్ 1 పరీక్షలను లోపభూయిష్టంగా నిర్వహించారని, అందుకు హైకోర్టు తీర్పే నిదర్శనమని పేర్కొన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని చెప్తున్న ప్రభుత్వం.. అలా అయితే రివాల్యూయేషన్ పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకొచ్చి వంచించారని విమర్శించారు. ‘చెల్లని నోటుకు గీతలెక్కువా, రేవంత్‌రెడ్డి నోటికి మాటలెక్కువ’ అన్న చందంగా సీఎం పరిస్థితి ఉన్నదని ఆరోపించారు.