హైదరాబాద్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నిప్పులు చెరిగారు. వర్గీకరణ తీర్పును అమలుచేయకుండా పోస్టింగ్‌లు ఎలా ఇస్తారని నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ హ క్కు రాష్ర్టాలకు ఉంటుందని ఆగస్టు 1న సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం డీఎస్సీ ఫలితాలు విడుదల చేశారని, 9వ తేదీన నియామకపత్రాలు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరమే డీఎస్సీ పరీక్షలు జరిగాయని, వర్గీకరణ రిజర్వేషన్లను ఎందుకు అమలుచేయడం లే దని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ 9వ తేదీన నల్లజెండాలతో అన్ని జిల్లాల్లో నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చారు.