Sircilla | హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సాంచాలపై సావు సప్పుళ్లు మోగుతున్నాయి. బట్టలు నేసే నేతలన్నల చేతులు మళ్లీ ఉరితాళ్లు పేనుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో బతుకులు ఆగ మై.. ఉరులకు చిరునామాగా మారిన సిరిశాల, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త ఊపిరి పో సుకున్నా.. ‘మార్పు’ అంటూ వచ్చిన కాంగ్రెస్ సర్కారులో మళ్లీ ‘ఉరి’శాలగా మారుతున్నది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారు బతుకమ్మ చీరలతో నేతన్నల బతుకులకు కల్పించిన భరోసాను, మలి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు రాగానే చెరిపేపి 11 నెలల్లో 13 మంది ఉసురు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సాంచాలు మూతపడి ఉపాధి కరువై.. బతుకు బరువై నేతన్నల కుటుంబాలు తిరిగి రోడ్డునపడ్డాయి. నిన్నమొన్నటిదాకా చిరునవ్వులు చిందిన చేనేతల ముఖాల్లో ఇప్పుడు కుటుంబాలను పోషించుకోలేని నిస్సహాయ స్థితిలో కారుతున్న కన్నీళ్లే కనిపిస్తున్నాయి.
బతుకు భరోసా కల్పించిన కేసీఆర్
ఉమ్మడి పాలనలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లో చేనేత, పవర్లూమ్ కార్మికులు దాదాపు 600 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ‘నేతన్నా.. ఆత్మహత్య చేసుకోకు.. కుటుంబాలను రోడ్డున పడేయద్దు’ అంటూ నాడు గోడల మీద పోలీసులు రాసిన రాతలు చూసి తెలంగాణ ఉద్యమ కాలంలో సిరిసిల్లకు వచ్చి న కేసీఆర్ చలించి పోయారు. తెలంగాణ వచ్చి న వెంటనే సీఎం హోదాలో రూ.50 లక్షలు పద్మశాలీ ట్రస్టుకు అందజేసి వారిని అప్పుల ఊబి నుంచి కొంత బయటకు తెచ్చారు. నేతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా బతుకమ్మ చీరల తయారీ బాధ్యతలు అప్పజెప్పి పవర్లూమ్ కార్మికుల ను ఆదుకున్నారు. ఏడాదికి దాదాపు రూ. 300 కోట్లతో బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు ఇచ్చారు. కొనసాగింపుగా రూ.5 లక్షల వరకు నేతన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారు. రూ పాయి ప్రీమియం చెల్లించకున్నా నేత కార్మికులకు బీమా వర్తింపచేశారు. ఉమ్మడి పాలనలో వలసబాట పట్టిన కార్మికులంతా కేసీఆర్ చూపి న బతుకు బాటతో తిరిగి వచ్చి కుటుంబాలతో సంతోషంగా కలిసి జీవించారు. నెలకు రూ.20 వేల వరకు ఇక్కడే సంపాదించడంతో ఆర్థిక భరోసా లభించింది. ఒక్క సిరిసిల్ల కార్మికులే కాదు.. దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి పొట్ట చేత పట్టుకుని వలస వచ్చిన కార్మికులు వందల సంఖ్యలో జీవనోపాధి పొందారు.
మళ్లీ పాత రోజులు
సమైక్య పాలనలో సిరిసిల్ల నేతన్నలకు కనీ సం అప్పు పుట్టని పరిస్థితి ఉండేది. మైక్రో ఫై నాన్స్లు, షేర్ముల్లా లాంటి వాటిని ఆశ్రయిం చి అప్పులు తీసుకొని వడ్డీలు కట్టలేక భార్య మెడలోని మంగళసూత్రాలు సైతం అమ్ముకున్న దీన స్థితి ఉండేది. ఓవైపు ఉపాధి లేక, మరోవైపు కుటుంబ పోషణ భారమై అప్పులు చెల్లించక లేక వందల సంఖ్యలో కార్మికులు నూలు పోగులనే ఉరితాళ్లుగా పేనుకుని బలవన్మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ ఏర్పాటు కు ముందు సిరిసిల్లలో పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ అలాంటి రోజులే వచ్చాయి. మళ్లీ నేతన్నల ఆత్మహత్య లు కొనసాగుతున్నాయి. మార్పు ఆంటూ ఆశ లు పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గాలికివదిలేసింది. వర్క్ ఆర్డర్లు ఇవ్వక పోవడంతో వేలాది సాంచాలు మూతపడి పనుల్లేక కార్మికులు రోడ్డున పడ్డారు. 11 నెలల్లో 13 మంది ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 30 వేల పైచిలు మరమగ్గాలున్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆదరణ లేక 2000కు పైగా సాంచాలను తుక్కుకింద అమ్ముకున్న దుస్థితి దాపురించింది. రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్స్ పార్కు మూతపడింది. కరెంటు బిల్లులు కూడా కట్టలేక యజమానులంతా యూనిట్లను మూసివేసి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
రూ.కోటి కూడా దాటని కాంగ్రెస్ సర్కార్ ఆర్డర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల మరమగ్గాలకు యూనిఫాంల తయారీ కోసం రూ.48.69 లక్షలు, టెక్స్టైల్స్ పార్కులోని మరమగ్గాలకు రూ.49.94 లక్షల వర్క్ ఆర్డర్లు ఇచ్చింది. అవి కూడా రూ.కోటి దాటకపోవడం గమనార్హం. మంజూరు చేసిన యారన్బ్యాంకు వేములవాడలో ఏర్పాటు చేయడంపై వ్యాపారుల్లో నిరసన వ్యక్తమవుతున్నది. మహిళా సంఘాలకు నాలుగు చీరల చొప్పున ఇస్తామని ఊరించుడే తప్ప, ఇప్పటివరకు అతీగతీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ‘వర్కర్ టు ఓనర్’ పథకం కింద నిర్మించిన షెడ్లను ఈ ప్రభుత్వం ప్రారంభించకుండా వదిలేసింది. వాటిని ఇతర గోదాములకు ఇచ్చింది.
బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలు
కేసీఆర్ ఉంటే ఆకలి చావులు ఉండకపోవు
11 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క సిరిసిల్లలోనే 13 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సర్కారే బాధ్యత వహించాలి. గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, పిల్లల డ్రెస్లు, కేసీఆర్ కిట్లు ఇ లా ప్రతి ఒక్క ఆర్డర్లు సిరిసిల్లకే ఇచ్చి కార్మికులకు చేతి నిం డా పని కల్పించింది. ఆయన అధికారంలో ఉండిఉంటే కార్మికుల ఆకలి చావులు జరిగేవి కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలి. లేదంటే వేలాది మంది కార్మికులతో సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం.
కార్మికులకు శాపంగా కాంగ్రెస్
కాంగ్రెస్ వచ్చాక చేనేత, మరమగ్గాల కార్మికులు ఉపాధి లేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, ప్రస్తుత విధానాలు చేనేత కార్మికుల పాలిట శాపాలుగా మారినయ్. బతుకమ్మ చీరల రద్దుతో ఒక్కసారిగా పవర్లూమ్ కార్మికులు ఉపాధి లేక కుప్ప కూలిపోయారు.
–కూరపాటి రమేశ్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర నాయకుడు