Osmania Hospital | హైదరాబాద్ : ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మరో ఘనత సాధించింది. ఆరేండ్ల బాలుడికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి, అతనికి ప్రాణాలను కాపాడింది. తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులకు బాలుడి తల్లిదండ్రులు రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు.
వికారాబాద్ జిల్లా చెల్లాపూర్ గ్రామానికి చెందిన పర్వతపురం సాయి ప్రణీత్(6) కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రణీత్‌ను అతని తల్లిదండ్రులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు.. కాలేయం మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తండ్రి కాలేయంలో నుంచి 250 గ్రాముల మేర తీసుకొని.. బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం తండ్రీకుమారులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సకు ప్రయివేటు ఆస్పత్రిలో అయితే రూ. 30 లక్షలు ఖర్చు అయ్యేది. ఇక ఆరోగ్య శ్రీ పథకం కింద బాధిత బాలుడికి ఉచితంగానే మెడిసిన్స్ అందజేయనున్నారు.
ఈ సందర్భంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హెడ్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్ మాట్లాడుతూ.. కాలేయ వ్యాధితో పోరాడుతున్న బాలుడికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామన్నారు. బాలుడి తండ్రి కాలేయం నుంచి కొంత సేకరించి, శస్త్రచికిత్స చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వయసు పిల్లలకు కాలేయ మార్పడి శస్త్ర చికిత్స చేయడం ఇదే తొలిసారి అని తెలిపారు.
ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటి వరకు 23 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు, 620 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్, ఒక పాంక్రియాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు.