ORR | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు తలమానికంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కొత్త చరిత్రను సృష్టించనున్నది. దేశంలోనే అతి ఎక్కువ విలువైన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ)గా దేశంలో మొదటి స్థానంలో నిలవనున్నది. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) పిలిచారు. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా ఆరేడు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అంచనా. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏండ్లకు లీజ్‌కు ఇవ్వనున్నారు. దీనిని దక్కించుకునే సంస్థ 30 ఏండ్లపాటు రోడ్డును నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఆ సంస్థకు టోల్ వసూలు చేసుకొనే అవకాశం కల్పిస్తారు. 30 ఏండ్ల తరువాత రోడ్డు నిర్వహణను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.
ఇప్పుడు కూడా నిర్వహణను ప్రైవేట్ సంస్థలకే ఇస్తున్నారు. అయితే ప్రతి ఏటా బిడ్ ద్వారా అప్పగిస్తున్నారు. ఏటా టెండర్ ప్రక్రియకే దాదాపు మూడు నెలలకుపైగా సమయం పడుతున్నది. మరికొందరు తమకు కేటాయించిన సమయాన్ని పొడిగించాలంటూ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కొత్త చిక్కులు, సమస్యలు లేకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన టీవోటీ చేయడం ద్వారా సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉం టుంది. ఈ నేపథ్యంలో 30 ఏండ్ల టీవోటీ ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. జాతీయ రహదారుల సంస్థ నిర్వహించే రీతిలోనే ఆయా నియమ నిబంధనలను అనుసరించి టీవోటీకి ఇస్తున్నారు. దీనికి సంబంధించిన బిడ్డర్స్తో హెచ్‌జీసీఎల్ అధికారులు సమావేశం నిర్వహించారు. బిడ్ వేసిన కొన్ని సంస్థల ప్రతినిధులు కొన్ని సందేహాలను వ్యక్తం చేయగా, అనుగుణంగా వివరణలు ఇచ్చారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై రెండు నిర్దేశిత మార్గాల్లో సోలార్ పవర్ప్లాంట్ల ఏర్పాటుకు హెచ్ఎండీఏ ప్రతిపాదనలను రూపొందించింది. సుమారు 13 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు ఐదేండ్ల పాటు నిర్వహణకు టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల బిడ్లు ఈ నెల 4 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. టెండర్లో పాల్గొనే కంపెనీలు డిజైనింగ్, ఇంజినీరింగ్, సప్లయి, కన్స్ట్రక్షన్, టెస్టింగ్, కమిషనింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది.