Fourth City | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మహేశ్వరం, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): అవి ఇందిరమ్మ కాలంలో భూమిలేని నిరుపేదలు వ్యవసాయం చేసుకొని జీవనోపాధి పొందుతారనే సదుద్దేశంతో ఇచ్చిన భూములు! లబ్ధిదారులందరూ దళితులు! ఇప్పుడా భూముల సమీపంలోనే ఔటర్ రింగు రోడ్డు, వంద ఫీట్ల రోడ్డు రావడం, అంతకుమించి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ ఫోర్త్ సిటీ నిర్మిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడంతో వాటిపై తెర వెనక రాజకీయ పెద్దలున్న ఓ కార్పొరేట్ కంపెనీ కన్నుపడింది. ఇంకేముంది! ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల భూములకు రెక్కలొచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఫోర్త్ అలియాస్ ఫ్యూచర్ సిటీ దరిమిలా కేవలం దాని పరిధిలోనే కాదు.. చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల పరిసరాల్లోనూ సర్కారు భూములకు రెక్కలొస్తున్నాయి. ఇక్కడే కాదు.. ఫోర్త్ సిటీతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వందల ఎకరాల భూములు అనధికారికంగా చేతులు మారుతున్నాయి. కొన్ని రికార్డుల్లో పట్టాలుగా రూపాంతరం చెందుతుంటే మరికొన్ని స్టాంపు కాగితాలపై 99 ఏండ్ల లీజు ప్రాతిపదికన పెద్దలపరమవుతున్నాయి.
కలెక్టర్ ఆదేశించినా చెర వీడని భూములు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి మంఖాల్ గ్రామంలోని లావణి పట్టా భూములు నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ పరమవడం ఒక్క మంఖాల్లోనే కాదు.. చుట్టుపక్కల గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. చివరికి కలెక్టర్ విచారణకు ఆదేశించినా నిరుపేదల భూములు చెర వీడటం లేదు. కొందరు పెద్దలు రంగంలోకి దిగి రైతులకు ఎకరానికి కోటి, కోటిన్నర చొప్పున ఒప్పందం చేసుకొని వారి నోరు మూయించారు.
ఓవైపు సాంకేతికంగా అధికారిక విచారణ కొనసాగుతున్నా క్షేత్రస్థాయిలో భూములను సదరు కంపెనీ స్వాధీనం చేసుకొని చుట్టూ రేకుల ప్రహరీ సైతం నిర్మించింది. ఇందులో మరో కొసమెరుపు ఉన్నది. అదేమంటే.. రికార్డుల్లో కంటే రైతుల వద్ద అదనంగా 12 ఎకరాల వరకు భూమి ఉంటే తాజా బదలాయింపులో దాన్ని కూడా కలిపి రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి రూ.15-20 కోట్లకు పైమాటే. అంటే ఇది రూ.600 కోట్లకు పైగా విలువైన భూముల వ్యవహారన్నమాట!
మంఖాల్ పరిధిలోని సర్వేనంబర్లు 608, 609, 610లో వాస్తవానికి 47.37 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములను ఇందిరమ్మ కాలంలో అంటే 1970 దశకంలోనే గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. వాస్తవానికి పదకొండు మంది రైతులకు 35.36 ఎకరాలు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో భూమి ఎక్కువ ఉండటంతో ఒక్కో రైతు అదనంగా కబ్జాలో ఉన్నారు. ఇలా రికార్డుల్లో కంటే వీరికి అదనంగా 12 ఎకరాల వరకు భూమి ఉన్నది.
కాగా రెవెన్యూ రికార్డుల్లో 11మంది రైతుల పేరిట లావణి పట్టా భూములుగా నమోదవుతూ ఉన్నాయి. ఖాస్రా పహాణీ వంటి కీలక రికార్డుల్లోనూ ఖారీజు ఖాతా సర్కారీవిగానే నమోదయ్యాయి. వాస్తవానికి గ్రామంలో ఈ భూములను చామలబండ చెల్కలు అంటారు. వీటి పక్కనే మసీదుబండ చెల్కలు ఉన్నాయి. ఇవి దళిత రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములని గ్రామంలో ప్రతిఒక్కరికీ తెలుసు. దీంతో ధరణి రికార్డుల్లో కూడా తొలుత ఇవి లావణి పట్టా భూములుగానే నమోదయ్యాయి.
ఆయా రైతుల నుంచి వారి వారసులకు కూడా ఈ భూముల బదలాయింపు (ఫౌతి) జరిగింది. ఈ భూములకు సమీపంలోనే ఔటర్ రింగు రోడ్డు ఉన్నది. ఇక్కడే పోలీస్ క్వార్టర్స్ కోసం భూమిని కేటాయించారు. ఆ క్వార్టర్స్ సౌకర్యార్థ్యం వంద ఫీట్ల రహదారి నిర్మించారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి నేరుగా వంద ఫీట్ల రోడ్డు మీదుగా భూముల్లోకి వెళ్లే వెసులుబాటు ఉండటంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో భూముల రికార్డులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. రాత్రికి రాత్రే ఇవి పట్టా భూములుగా మారిపోయాయి.
కొన్ని నెలల కిందట వెలుగులోకి..
మంఖాల్‌లోని లావణి పట్టా భూములు పట్టా భూములుగా మారాయని కొన్ని నెలల కిందట వెలుగులోకి వచ్చింది. ఇలా వెలుగులోకి రావడం కూడా వ్యూహం ప్రకారమేనని తెలుస్తున్నది. లావణి పట్టా భూములు పట్టాగా మారాయన్న ప్రచారంతో పాటు వాటికి సంబంధించిన రికార్డులేవీ లేవు. అన్ని గల్లంతయ్యాయని ప్రచారం జరుగుతున్నది. అధికారికవర్గాల్లోనూ ఇదేరీతన ప్రచారం చేశారు. సేత్వారీతో పాటు కొన్ని సంవత్సరాల రికార్డుల్లో పట్టా భూమిగా నమోదైందని, దీన్ని ఆసరా చేసుకొనే ఇలా పట్టాగా బదలాయించారని ప్రచారమైంది.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక దీనిపై విచారణకు ఆదేశించగా కొందరు అధికారులు కొంతకాలం విచారణ చేశారు. కానీ ఇప్పటివరకు ఆ ఫలితమేమిటో బయటికి రాలేదు. విచారణ సారాంశమే ఇప్పటివరకు వెల్లడించలేదని ఓ అధికారి తెలిపారు. విచారణలో భాగంగా ప్రచారంలో ఉన్న విషయాలనే నమోదు చేసినట్టు సమాచారం. అధికారులు కూడా కొన్నేండ్ల రికార్డుల్లో పట్టా భూమిగా ఉన్నదని, దీని ఆధారంగానే బదలాయింపు జరిగిందని, అసలు రికార్డులే లేకుండా చేశారని చెప్తున్నారు.
కానీ ‘నమస్తే తెలంగాణ’ మహేశ్వరం తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి సంప్రదించగా మూడు సర్వేనంబర్లకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయి. అందులో మూడు సర్వేనంబర్ల భూములు లావణి పట్టాగానే ఉన్నాయి. గ్రామంలో ఎవరిని అడిగినా ఇందిరమ్మ కాలంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములేనని చెప్పారు. రికార్డులను పరిశీలిస్తే సేత్వారీలో ఖారీజ్ ఖాతా సర్కారీగానే ఉన్నది. 1954-55లో సర్కారీగానే నమోదై ఉన్నది. 1980, 90,2000 ఇలా పలు దశకాల్లోని పలు సంవత్సరాల రికార్డులను చూసినా లావణి పట్టాగానే ఉన్నది.
కాకపోతే కొన్నేండ్లు రికార్డుల్లో ఒకోచోట పట్టాగా రాశారు. ఉదాహరణకు 608/1 లావణి పట్టాగా రాసి, 608/2 పట్టాగా రాశారు. దీనిపై ఓ తహసీల్దార్‌ను సంప్రదించగా రెవెన్యూ రికార్డుల నమోదు సమయంలో వీఆర్వోలు నిర్లక్ష్యంగా లావణి పట్టా అని రాసే బదులు పట్టా అని రాసి వదిలేశారని, రాష్ట్రంలోని పలుచోట్ల కూడా ఇదే నిర్లక్ష్యం ఉన్నదని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం కేవలం దాన్ని ఆసరాగా చేసుకొని సర్కారు భూమిని పట్టాగా మార్చడం గమనార్హం.
ఆధారాలున్నా కాలయాపన ఎందుకో?
ఈ మూడు సర్వేనంబర్లలోని భూములు లావణి పట్టా అని రికార్డుల్లో స్పష్టంగా ఉన్నది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామసభ నిర్వహించి విచారణ చేసినా గ్రామంలోని వారంతా పూసగుచ్చినట్టు వివరాలు వెల్లడిస్తారు. ప్రధానంగా ఈ మూడు సర్వేనంబర్లలోని భూములు ప్రభుత్వానివే అనేందుకు బలైమన ఆధారం ఒకటి ఉంది. గతంలో 608/5 సర్వేనంబర్‌లోని రెండెకరాల భూమిని సదరు లావణి పట్టాదారు విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు.
నిబంధనలకు విరుద్ధంగా విక్రయించేందుకు ప్రయత్నించినందున నిబంధనల మేరకు పీవోటీ కింద ఆ రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంఖాల్ లో పారిశుధ్య నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డుకు భూమి కావాలని అధికారులు అన్వేషించినపుడు పీవోటీ కింద తీసుకున్న ఈ రెండెకరాల భూమి తెరపైకి వచ్చింది. దాన్ని డంపింగ్ యార్డుకు కేటాయించారు. అయితే ఈ బదలాయింపు ప్రక్రియలో మాత్రం ఆ రెండెకరాలను వదిలేశారు. ఎందుకంటే.. మిగిలిన భూమికి యజమానులైన వారికి కోట్లు ఇచ్చి నోర్లు మూయించారు.
కానీ ఈ రెండెకరాలను కూడా స్వాధీనం చేసుకుంటే గ్రామస్తులు డంపింగ్ యార్డుకు కేటాయించిన భూమిని ఎలా తీసుకుంటారంటూ గొడవ చేస్తే మిగిలిన పెద్ద విస్తీర్ణానికి ఎసరు పడుతుంది. అందుకే ఇప్పటికీ నిషేధిత జాబితాలో 608/5 కింద రెండెకరాలను ప్రభుత్వ భూమిగా నమోదు చేసి ఉంచారు. ఈ భూములు ప్రభుత్వానివే అనేందుకు లావణి పట్టాను పీవోటీ కింద స్వాధీనం చేసుకున్న సాక్ష్యం అధికారుల వద్దనే ఉన్నది.
రికార్డుల్లో ఉన్న దాని కంటే అదనంగా 12 ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ధరణి వెబ్సైట్లో కనిపిస్తున్నది. ఈ కోణంలోనూ అధికారులకు ఇందులో ఏదో మతలబు ఉన్నదనేది స్పష్టంగా తెలుస్తున్నది. అయినా విచారణ పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తుండటం, మరోవైపు భూమిలో సదరు కంపెనీ వ్యక్తులు కార్యకలాపాలు మొదలు పెట్టడం అనుమానాలకు తావిస్తున్నది.
విల్లాల నిర్మాణానికి స్కెచ్..
ఔటర్‌కు అతి సమీపంతో పాటు వంద ఫీట్ల రహదారి ఉండటంతో ఇక్కడ విల్లాలకు భారీ గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే తెరవెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విచారణ కొనసాగుతున్నదని అధికారులు చెబుతుండగా నెలల తరబడి విచారణ ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచారణ కొనసాగుతుండగానే సదరు కంపెనీ వ్యక్తులు భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించారు. రక్షణగా కొందరు వ్యక్తులను అక్కడ నియమించి, ఎవరినీ లోపలికి అనుమతించడంలేదు. ప్రస్తుతం ఈ భూములను వ్యవసాయేతరంగా మార్చేందుకు నాలా కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియ పురోగతిలో ఉన్నట్టు ధరణిలోనే చూపిస్తున్నది.
నోట్ల కట్టలతో నోర్లు మూయించి!
ముందుగా ఈ భూ రికార్డుల బదలాయింపు రైతులకు తెలియకుండానే జరిగినట్టు తెలిసింది. విషయం బయటికి పొక్కగానే సంబంధిత రైతులు పలువురు రాజకీయ నేతలను సంప్రదించారు. అనంతరం తెరవెనుక ఏం జరిగిందోగాని.. కొందరు బడా వ్యక్తులు రంగంలోకి దిగి రైతులను బుజ్జగించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బహిరంగ మార్కెట్లో ఇదేచోట పట్టా భూములు ఉంటే ఎకరా రూ.15-20 కోట్లకు పైగా ధర పలుకుతుందని తెలిసింది. కాకపోతే ఇవి సర్కార్‌వి కావడం, పైగా రికార్డులు మారిపోవడంతో న్యాయపరంగా పోరాడి సాధించేదేమీలేదని రైతులకు చెప్పినట్టు తెలిసింది.
ఇప్పుడు రికార్డులు మారినందున ఏమీ చేయలేరని, డబ్బు తీసుకొని కాగితం రాసివ్వాలని సూచించినట్టు సమాచారం. దీంతో రైతులు కూడా కోట్లల్లో డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో మిన్నకుండినట్టు సమాచారం. ఔటర్ నుంచి నేరుగా వంద ఫీట్ల రహదారి భూముల వరకు వెళుతుంది. ఈ క్రమంలో రోడ్డుకు సమీపంలో ఉన్న భూముల వారికి ఎకరాకు రూ.2 కోట్ల వరకు, లోపల ఉన్న వారికి కోటి, కోటిన్నర వరకు చెల్లించినట్టు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో చెల్లించేందుకు కారణం కూడా ఉన్నదని ఓ వ్యక్తి తెలిపారు. బదలాయింపుల్లో భాగంగా రికార్డుల్లో అంటే రైతు పాస్ పుస్తకంలో ఎంత విస్తీర్ణం ఉన్నదో అంతమేరకే డబ్బులు చెల్లించారని, కానీ అదనంగా 12 ఎకరాల వరకు రికార్డులు, క్షేత్రస్థాయిలో వస్తున్నందున రైతులకు కోట్లల్లో ముట్టజెప్పారు.
గందరగోళంగా బదలాయింపు
మంఖాల్‌లోని 608, 609, 610 సర్వేనంబర్లలోని భూములను లావని పట్టా నుంచి పట్టాగా బదలాయించడం వ్యూహాత్మకమో? లేదా హడావుడో? గాని ప్రక్రియ అంతా గందరగోళంగా ఉన్నది. ప్రస్తుతం ధరణి వెబ్సైట్లో ఈ మూడు సర్వేనంబర్లలోని వివరాలు పరిశీలిస్తే..
విచారణ పూర్తి కాలేదు: కలెక్టర్ శశాంక
మంఖాల్‌లో మూడు సర్వేనంబర్లలోని భూముల అంశంపై రంగారెడ్డి కలెక్టర్ శశాంకను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా దానిపై విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. మరోవైపు సదరు వ్యక్తులు భూములను స్వాధీనం చేసుకుని, రేకుల ప్రహరీ నిర్మించారని చెప్పగా ప్రభుత్వ భూమి అని విచారణలో తేలితే ప్రహరీని తొలగిస్తామని చెప్పారు.