హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మాటలు బూటకమని చెప్పడానికి పెంట్లవెల్లి రైతుల గోసే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లిలో ఉన్న 499 మంది రైతుల్లో ఒకరికీ రుణమాఫీ కాకపోవడం పచ్చిమోసం కాక మరేమిటని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. డిసెంబర్ నుంచి ఆగస్టు 15 వరకు డెడ్లైన్లు పెట్టిన సీఎం.. నేటివరకూ వీరికి రుణమాఫీ ఎందుకు కాలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పావుశాతం కూడా మాఫీ చేయకుండా వందశాతం అయిపోయినట్టు ముఖ్యమంత్రి పోజులు కొడుతున్నారని విమర్శించారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంట్లవెల్లి రైతుల రుణాలను మాఫీ చేసి వారి గోడు తీర్చాలని డిమాండ్ చేశారు.
మరోవైపు గురుకులాల్లో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు రోజుల్లో సిర్పూర్లో 35 మంది గురుకుల విద్యార్థులు జ్వరాలబారిన పడ్డారని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. బాగాలేని విద్యార్థులను తల్లిదండ్రుల వద్దకు పంపి చేతులు దులుపుకోవడం అంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. ఇంత జరుగతున్నా సీఎం రేవంత్రెడ్డి మాత్రం కనీసం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలి, బీఆర్ఎస్ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతాపం చూపుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగమైందని విమర్శించారు. తాము ప్రకటించిన గృహజ్యోతికి తూట్లు పొడిచిన కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్ అమలు చేసిన 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకంపై కుట్రలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఒకవైపు రుణమాఫీ కాలేదంటూ రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు, మరోవైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు, ఇప్పుడు నల్లా బిల్లులంటూ డోర్లకు బిల్లులు అతికియ్యడం ఏమిటని ప్రశ్నించారు.