హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు చేసే స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ (ఎస్‌ఏవీఎస్) కు విశేష స్పందన లభిస్తున్నది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు సమర్పించిన సర్టిఫికెట్లు అసలువో.. కావో తెలుసుకోవచ్చు. అందుకు అనేక సంస్థలు ఈ పోర్టల్‌ను ఆశ్రయిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలోనే సర్టిఫికెట్ల పరిశీలనకు 8,376 దరఖాస్తులొచ్చాయి. వీటిలో 3 వేల సర్టిఫికెట్లు అసలువని తేలగా, మిగతా వాటి వివరాల కోసం యూనివర్సిటీలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఒకే ఒక్క క్లిక్‌తో..
ఇటీవలికాలంలో నకిలీ సర్టిఫికెట్లు భారీగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల కోసం పలువురు నకిలీ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు. యూనివర్సిటీలు మెమోల ముద్రణకు లోగోలు, వాటర్‌మార్క్, దృఢమైన పేపర్ల వినియోగం వంటి సెక్యూరిటీ ఫీచర్లను వినియోగిస్తున్నాయి. దాంతో పాటు యూనిక్ కోడ్ నంబర్లను కూడా కేటాయిస్తున్నాయి. అయినా నకిలీ సర్టిఫికెట్ల దందా ఆగడం లేదు. పటిష్ఠంగా సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నా.. కొన్నిసార్లు గుర్తుపట్టలేనంత జాగ్రత్తగా ఫేక్రాయుళ్లు సర్టిఫికెట్లు తయారుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టును రట్టుచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకే ఒక్క క్లిక్‌తో సర్టిఫికెట్లను పరిశీలించే పోర్టల్‌ను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి గత ఏడాది నవంబర్ 23న ప్రారంభించారు. 25 లక్షల విద్యార్థుల డాటాను ఈ పోర్టల్ సర్వర్‌లో నిక్షిప్తంచేశారు.
జేఎన్టీయూ వాటిపైనే..
సర్టిఫికెట్ల పరిశీలనకు వస్తున్న దరఖాస్తుల్లో జేఎన్టీయూకు చెందినవే అధికంగా ఉంటున్నాయి. నియామక సంస్థలు, ఐటీ కంపెనీలు.. జేఎన్టీయూ బీటెక్, ఎంటెక్ డిగ్రీలపైనే ఎక్కువగా ఆరా తీస్తున్నాయి. మరీ ముఖ్యంగా, ఐటీ రంగంలో స్థిరపడ్డవారి డిగ్రీలపైనే సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ కంపెనీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఎస్‌ఏవీఎస్ పోర్టల్‌ను ఆశ్రయించి సంబంధిత విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకొంటున్నాయి. రాష్ట్రమంతటికి సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ ఒకటే ఉన్నది. కావున, ఈ వర్సిటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దరఖాస్తులు అధికంగా వస్తున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొంటున్నారు.
సులభంగా.. వేగంగా సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్రంలో నకిలీ విత్తనాలను ప్రభుత్వం పటిష్ఠంగా అరికట్టింది. ఇదే తరహాలో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఏవీఎస్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. నకిలీ సర్టిఫికెట్లను ఈ పోర్టల్ సహాయంతో సులభంగా గుర్తించవచ్చు. నిమిషాల వ్యవధిలోనే సర్టిఫికెట్ అసలుదో.. నకిలీదో అన్నది తేల్చవచ్చు. ఉద్యోగాలిచ్చే వారు, సంస్థలు, విద్యాసంస్థలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సులభంగా తమకు అనుమానమున్న సర్టిఫికెట్లపై విచారణ చేపట్టవచ్చు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రిక్రూటింగ్ ఏజెన్సీలకు సహాయకారిగా పనిచేస్తుంది.
-ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్